Rayachoty: రాయచోటిలో ఇళ్ల స్థలాల రగడ.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిన భూవివాదం!
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇళ్ల స్థలాల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Rayachoty: రాయచోటిలో ఇళ్ల స్థలాల రగడ.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిన భూవివాదం!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఇనాయత్ ఖాన్ చెరువు సమీపంలో ఇళ్ల స్థలాల కోసం పెమ్మాడపల్లి గ్రామస్తులు ప్రభుత్వ భూమిని చదును చేశారు. చదును చేసుకుంటుండగా రాయచోటి వైసీపీ ఎంపీపీ రాజమ్మ భర్త వైసీపీ నాయకుడు పల్లపు రమేష్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని భూమిని చదును చేసే పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ భూమి తమది అని తమ పేరిట గతంలోనే డి.పట్టాలు పొందామని ఇప్పుడు దౌర్జన్యంగా భూమిలోకి వచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరితే ఎందుకు ఒప్పుకుంటాం అంటూ అక్కడ ఉన్న గ్రామస్తులతో వైసీపీ నాయకుడు పల్లపు రమేష్ దౌర్జన్యానికి దిగారు.
దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాలలు అదే స్థలంలో ఇవ్వాల్సిందేనంటూ గ్రామ టిడిపి నాయకులు, మాజీ సర్పంచ్ లు పల్లపు వాసు, ఓర్సు వాసు, బసయ్య, టిడిపి మండల జనరల్ సెక్రెటరీ కోటకొండ రవి శంకర్ లు అక్కడికి చేరుకుని పేదలకు మద్దతు గా నిలిచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ పట్టాలు పొంది, గ్రామం చుట్టూ ఉన్న సుమారు 15 ఎకరాల వరకు ఎంపీపీ రాజమ్మ భర్త వైసీపీ నాయకుడు పల్లపు రమేష్ కాజేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు స్థలాలు లేకుండా చేశారని మండలంలోని పెమ్మాడపల్లి, గరుగుపల్లి ప్రాంతాలకు చెందిన వందలాది మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. పట్టణానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను చదును చేసి పట్టాల కోసం ప్రయత్నిస్తుండగా వైసీపీ నాయకులు దౌర్జన్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగుతుండగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగించారు. వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారి భూభాగోతాలన్నీ వెలుగులోకి తీసుకొస్తామని వారి దగ్గర అక్రమంగా పట్టాల పొందిన భూములన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెనక్కి తీసుకునేలా ఉద్యమిస్తామని టీడీపీ నాయకులు తెలియజేశారు.




