Neelapuram: నీలాపురంలో గ్రావెల్ మాఫియా స్వైరవిహారం అధికారుల వైఫల్యంపై ఆగ్రహం!

Neelapuram: దువ్వూరు మండలం నీలాపురంలో యథేచ్ఛగా సాగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలు. వందలాది టిప్పర్లతో సహజ వనరులు దోపిడీ.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 16 Oct 2026 8:32 AM IST
Neelapuram
X

Neelapuram: నీలాపురంలో గ్రావెల్ మాఫియా స్వైరవిహారం అధికారుల వైఫల్యంపై ఆగ్రహం!

Neelapuram: పేదవాడు గూడు కట్టుకోవడానికో, ఇంటి ముంగిట గుంత పూడ్చుకోవడానికో ఒక ట్రాక్టర్ మట్టి తోలుకుంటే చాలు.. నిబంధనల పుస్తకం తీసి కేసులు, జరిమానాలంటూ జులుం ప్రదర్శించే అధికార యంత్రాంగం, వందల కొద్దీ టిప్పర్లతో సహజ వనరులను కొల్లగొడుతున్న గ్రావెల్ దొంగల ముందు ఎందుకు చేతులెత్తేసిందో సమాధానం చెప్పాలని దువ్వూరు మండలం నీలాపురం గ్రామ ప్రజలు నిలదీస్తున్నారు.

​నీలాపురం పరిసరాల్లో ప్రభుత్వ, బంజరు భూములే లక్ష్యంగా గ్రావెల్ మాఫియా పగలు, రాత్రి తేడా లేకుండా యంత్రాలతో తవ్వేస్తూ నిలువునా గుల్ల చేస్తోంది. రోజుకు వందలాది వాహనాల్లో విలువైన గ్రావెల్ యథేచ్ఛగా సరిహద్దులు దాటుతున్నా.. సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు కంటికి కనిపించకపోవడం వెనుక మతలబేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, కోట్ల రూపాయల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంటే అధికార గణం మామూళ్ల మత్తులో జోగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అడ్డూ అదుపు లేకుండా మితిమీరిన వేగంతో, ఓవర్‌లోడ్‌తో తిరుగుతున్న భారీ టిప్పర్ల ధాటికి గ్రామీణ రోడ్లు ఛిద్రమై అధ్వానంగా తయారయ్యాయి. రేయింబవళ్లు లేచే దుమ్ము, ధూళితో గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. రాకపోకలు సాగించే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు ఏ లారీ కింద పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

సామాన్యుడికో న్యాయం, అక్రమార్కులకు మరో న్యాయమా అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నీలాపురంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో గ్రామస్తులందరం ఏకమై గ్రావెల్ వాహనాలను అడ్డుకుంటామని, రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR