Badvel: ఎమ్మెల్సీ కుమారుడు ఆదిత్య రెడ్డి అరెస్ట్.. రోడ్డెక్కిన వైసీపీ!

Badvel: కడప జిల్లా బద్వేలులో హైటెన్షన్. బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోశారన్న ఆరోపణలతో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి అరెస్ట్. పీఎస్ ఎదుట ఎమ్మెల్యే సుధ ధర్నా.

B. ARUN KUMAR, BADVEL
Published on: 5 Nov 2026 10:10 PM IST
Badvel
X

Badvel: ఎమ్మెల్సీ కుమారుడు ఆదిత్య రెడ్డి అరెస్ట్.. రోడ్డెక్కిన వైసీపీ!

బద్వేల్: బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పడిందో.. రాజకీయాల్లో నిప్పు రాజుకుందో పోలింగ్ కేంద్రంలో మొదలైన వివాదం పోలీస్ స్టేషన్ గుమ్మం వరకు చేరింది. ఫిర్యాదు ఒకవైపు.. అరెస్టులు మరోవైపు.. నిరసనలు ఇంకోవైపు ఎన్నికల వేళ బద్వేలు రాజకీయ వేదికపై మరోసారి ఉద్రిక్తత తెరపైకి వచ్చింది.

గోపవరం మండలం ఎస్. రామాపురం పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన ఈ రాజకీయ కలకలానికి కేంద్రబిందువైంది. ఎంపీటీసీ అభ్యర్థి వెంకటసుబ్బమ్మ భర్త నరసారెడ్డి పోలింగ్ బూత్‌లో ఉన్న ఇంకును తీసుకొని బ్యాలెట్ బాక్స్‌లో పోశారన్న ఆరోపణలపై అక్కడ విధుల్లో ఉన్న పీఓ బద్వేల్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ఫిర్యాదులో నరసారెడ్డి, ఆయన అనుచరులతో పాటు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి.

పోలీస్ వాహనానికి అడ్డుకట్ట.. నినాదాలతో రాజకీయ వేడి చెలరేగింది

అరెస్టు వార్త గుప్పుమనగానే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ పరిసరాలకు చేరుకున్నారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుంటూ నిరసనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆదిత్య రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే డాక్టర్ సుధ , మాజీ అడా చైర్మన్ సింగసాని గురుమోహన్‌ బద్వేలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ లతో తో పాటు పలువురు ముఖ్య నాయకులు పోలీస్ వాహనానికి అడుగడుగునా అడ్డుపడుతూ నినాదాలు చేశారు. చివరకు బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్ గుమ్మం వద్ద రాజకీయ పోరు

ఒకవైపు పోలీసుల విచారణ.. మరోవైపు రాజకీయ నిరసన వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు.. ప్రస్తుతం ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి, నరసారెడ్డిలను రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచి సీఐ కృష్ణయ్య, ఎస్సై నాగ చిరంజీవి విచారిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల ప్రజాస్వామ్యానికి బ్యాలెట్ బాక్స్ గుండె వంటిది. ఆ గుండె చుట్టూ వివాదం రగిలితే రాజకీయాలు మౌనంగా ఉండవు. బద్వేలు ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనపై పోలీసుల విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుంది అరెస్టులపై రాజకీయ నిరసన ఎక్కడికి దారితీస్తుంది అన్న ప్రశ్నలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బద్వేలు రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL