Kadapa: వియత్నాం పడవ ప్రమాదం కడప వ్యాపారి ముడియం శ్రీధర్ మృతి
Kadapa: వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం. కడపకు చెందిన మొబైల్ వ్యాపారి ముడియం శ్రీధర్ మృతితో జిల్లాలో విషాదం. భారత రాయబార కార్యాలయం సహాయక చర్యలు పర్యవేక్షిస్తోంది.
Kadapa: వియత్నాం పడవ ప్రమాదం కడప వ్యాపారి ముడియం శ్రీధర్ మృతి
కడప: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ ప్రముఖ మొబైల్ సంస్థ తన రాష్ట్రవ్యాప్త పంపిణీదారుల కోసం నిర్వహించిన విదేశీ పర్యటనలో భాగంగా వియత్నాం వెళ్లిన కడపకు చెందిన ప్రముఖ మొబైక్ వ్యాపారవేత్త ముడియం శ్రీధర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు.
కడపకు చెందిన ముడియం శ్రీధర్, నయిమ్‌తో కలిసి ఈ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 25 నుంచి 28 మంది పంపిణీదారులు ఈ విహారయాత్రలో పాల్గొన్నారు. పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు భారతీయ పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారేనని తెలుస్తోంది.
ప్రమాద సమయంలో నయిమ్ సురక్షితంగా బయటపడగా, ఆయన అక్కడి పరిస్థితులను వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు. అలాగే శ్రీధర్ కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారు. కాగా... మృతుడు ముడియం శ్రీధర్ గత 25 సంవత్సరాలుగా 'కౌశిక్ కమ్యూనికేషన్స్' పేరుతో మొబైల్ వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. ఆయనకు కుమారుడు కౌశిక్ (18), కుమార్తె కిరణ్మయి ఉన్నారు.
కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హో చి మిన్ నగరం, హనోయిలో ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఈ ఘటనతో కడప జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీధర్ మృతి వార్త తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.




