Kadapa Girl Murder Case: కడప బాలిక హత్య కేసు: నిందితుడిపై పోలీసుల కాల్పులు!
Kadapa Girl Murder Case: కడప జిల్లా ఖాజీపేట బాలిక హత్య కేసులో సంచలనం. నిందితుడు వెంకటేష్ పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్పులు జరిపారు.
Kadapa Girl Murder Case: కడప బాలిక హత్య కేసు: నిందితుడిపై పోలీసుల కాల్పులు!
Kadapa Girl Murder Case: కడప జిల్లా ఖాజీపేటలో బాలిక గొంతు కోసి హత్య చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వెంకటేష్‌ను మైదుకూరు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా, బసాపురం చెక్‌పోస్ట్ వద్ద అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన పోలీసులపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మరియు ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెంకటేష్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలిక హత్య ఉదంతం స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టించింది. నిందితుడిని తమకు అప్పగించాలని లేదా బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. భారీ ఎత్తున ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
సీఎం చంద్రబాబు సీరియస్:
ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. మహిళలు, బాలికలపై అరాచకాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నడుమ దర్యాప్తును వేగవంతం చేశారు.




