Kadapa: ప్రొద్దుటూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన
Kadapa: ప్రొద్దుటూరు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్. కార్యకర్తల సమావేశంలో పాల్గొని, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు.
Kadapa: ప్రొద్దుటూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన
కడప: రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలపై హెడ్‌మిస్ట్రెస్ ధనలక్ష్మితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఇటీవల వయోభారంతో కన్నుమూసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తల్లి పొల్లమ్మ నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సమావేశానికి వచ్చిన టీడీపీ మాజీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనుచరులను సభ్యత్వ కార్డులు లేవని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి నారా లోకేష్, పార్టీ కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని అన్నారు. రానున్న ఏ ఎన్నికలైనా కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే విజయం తెలుగుదేశం పార్టీదేనని మంత్రి నారా లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.




