Kadapa: 2 డీఏలకే సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం వెంకట్రామిరెడ్డి
Kadapa: కడపలో మీడియాతో మాట్లాడిన వెంకట్రామిరెడ్డి. 2 డీఏలకే సంబరాలు చేసుకోవడాన్ని తప్పుపడుతూ, ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
Kadapa: 2 డీఏలకే సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం వెంకట్రామిరెడ్డి
కడప: రెండు డిఏలు ఇచ్చినందుకే పటాకులు కాల్చి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి విమర్శించారు . కడప ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘం నాయకులతోపాటు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చర్చలకు ఆహ్వానించారు అంటే ఉద్యోగులకు మేలు కలుగుతుందని ఆశించాం కానీ, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడాల్సిన ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వ భజనకు అంకితమయ్యారని విమర్శించారు.
రెండు డీఏలు, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ మాత్రమే ఇచ్చిన ఏదో ఉద్యోగులకు పెద్ద ఎత్తున మేలు జరిగిందని సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటే రెండు డీఏలు ఇచ్చి అంతా చేశామని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన తొమ్మిది హామీలలో ఒకటైన నెరవేర్చిందా అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిందని గుర్తు చేశారు.రెండున్నరేళ్లుగా ఐఆర్, పీఆర్సీ లేకపోవడం ఎప్పుడూ లేదని అన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన చేస్తే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఎందుకు పరిష్కరిస్తుందని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో పిఆర్సి ని ప్రకటించి ఎన్నికల అనంతరం మరో ఐదు సంవత్సరాలు ఉద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలతో, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, హక్కులపై పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.




