Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ రాజకీయాల్లో అరుదైన ఘనత!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ రాజకీయాల్లో అరుదైన మైలురాయి. కామిశెట్టి కుటుంబం నుంచి మూడో తరం ప్రతినిధిగా ఎంబాఏ విద్యార్థి కామిశెట్టి సుబ్బ రవితేజ కౌన్సిలర్‌గా ఏకగ్రీవ ఎన్నిక.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 31 Oct 2026 8:22 AM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ రాజకీయాల్లో అరుదైన ఘనత!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన కామిశెట్టి కుటుంబం ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మున్సిపల్ పాలనలో ఏకంగా మూడో తరం ప్రజాప్రతినిధిగా అడుగుపెట్టడంతో పట్టణంలో కామిశెట్టి కుటుంబ రాజకీయ ప్రస్థానం మరో ముందడుగు వేసింది.

తరాలు మారినా ప్రజాసేవే పరమావధిగా సాగుతున్న ఈ కుటుంబం నుంచి తాజాగా మూడో తరం ప్రతినిధిగా కామిశెట్టి సుబ్బ రవితేజ కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై సమగ్ర కథనం...

​ప్రొద్దుటూరు రాజకీయాల్లో కామిశెట్టి కుటుంబానికి సుదీర్ఘమైన, ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రముఖ వ్యాపారవేత్తగా, ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేరుగాంచిన స్వర్గీయ కామిశెట్టి సుబ్బారావు తొలి తరంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

తన పాలనా కాలంలో పట్టణాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేసి ప్రజల హృదయాల్లో చెరిపివేయరాని ముద్ర వేశారు. మున్సిపల్ చైర్మన్‌గా ఆయన అందించిన సేవలు నేటికీ పట్టణ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి.

తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజల ఆదరాభిమానాలను నిలబెట్టుకుంది రెండో తరం. తొలి తరం అందించిన ప్రేరణతో కామిశెట్టి సుబ్రహ్మణ్యం (అలియాస్ బాబు) మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

పట్టణ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పురపాలక సంఘం నిర్వహణలో కీలక పాత్ర పోషించి కామిశెట్టి కుటుంబ ఘనమైన రాజకీయ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఒకే కుటుంబం నుంచి వేర్వేరు తరాల్లో చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా సేవలు అందించడం ఆ రోజుల్లోనే పెద్ద విశేషంగా నిలిచింది.

​యువ నాయకత్వం - మూడో తరం అరంగేట్రం (కామిశెట్టి సుబ్బ రవితేజ):

ఇప్పుడు అదే కుటుంబం నుంచి మూడో తరం యువత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టింది. కామిశెట్టి కృష్ణమూర్తి తనయుడు, ఎంబీఏ (MBA) పూర్తి చేసిన విద్యావంతుడైన కామిశెట్టి సుబ్బ రవితేజ కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉన్నత విద్యను అభ్యసించి, ఆధునిక ఆలోచనలతో ప్రజాసేవకు సిద్ధమైన రవితేజ ఏకగ్రీవం కావడం వెనుక కామిశెట్టి కుటుంబంపై పట్టణ ప్రజలకు ఉన్న నమ్మకమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.

​తాత చైర్మన్‌గా, బాబాయి వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించగా, ఇప్పుడు మనుమడు కౌన్సిలర్‌గా మున్సిపల్ పాలకమండలిలో అడుగుపెట్టడం ప్రొద్దుటూరు పట్టణంలో ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది.

మూడు తరాలుగా స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న కామిశెట్టి కుటుంబ ప్రస్థానం పట్ల స్థానికులు, వివిధ వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన కామిశెట్టి సుబ్బ రవితేజకు వివిధ రకాల ప్రముఖులు, పట్టణ ప్రజలు ఘనంగా అభినందనలు తెలియజేస్తున్నారు.

విద్యావంతుడైన ఈ యువ నాయకుడి ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి మరిన్ని కొత్త వింతలను చూస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిస్తారని స్థానికులు ఆకాంక్షిస్తున్నరు.

తాత నుంచి తండ్రి, బాబాయిల దాకా ప్రజాసేవనే ఊపిరిగా మలచుకున్న కామిశెట్టి కుటుంబం.. ఇప్పుడు మూడో తరం రూపంలో రవితేజతో తమ రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. రాబోయే రోజుల్లో రవితేజ కౌన్సిలర్‌గా ఎలాంటి ముద్ర వేస్తారో వేచి చూడాలి!

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR