Khajipet: ఖాజీపేటలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు!

Khajipet: కడప జిల్లా ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయంలో మహిళల భద్రత, సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 14 May 2026 4:52 PM IST
Khajipet
X

Khajipet: ఖాజీపేటలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు!

ఖాజీపేట: కడప జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు... మైదుకూరు డీ.ఎస్.పీ శ్రీ జి.రాజేంద్రప్రసాద్ గారి పర్యవేక్షణలో ఖాజీపేట సి.ఐ వంశీధర్ ఆధ్వర్యంలో ఖాజీపేట ఎం.పీ.డి.ఓ కార్యాలయంలో గురువారం మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొని పోలీస్ శాఖ అందించిన మార్గనిర్దేశాన్ని ఆసక్తిగా స్వీకరించారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, ముఖ్యంగా గృహహింస, వేధింపులు, సైబర్ మోసాలు, బాల్య వివాహాలపై అధికారులు వివరంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా ఖాజీపేట సి.ఐ ఎస్. వంశీధర్ మాట్లాడుతూ శక్తి టీమ్ సేవలు, మహిళల కోసం అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్‌లో అందించే సేవల గురించి కూడా తెలియజేశారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, చట్టం వారికి పూర్తి రక్షణ కల్పిస్తుందని ఖాజీపేట సి.ఐ హితవు పలికారు.

పోక్సో చట్టం, మహిళల ఆస్తి హక్కులు, చట్టపరమైన రక్షణ అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఖాజీపేట సి.ఐ వంశీధర్ సూచించారు. ఖాజీపేట తహసిల్దార్ ఏ.వి రమణమ్మ గారు మాట్లాడుతూ అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బ్యాంక్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో ధైర్యం, స్వీయరక్షణ భావన పెంపొందించడం పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112 కి సమాచారం అందించాలని, తక్షణ సహాయం అందించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఖాజీపేట డిప్యూటీ ఎం.పీ.డి.ఓ ఏ. గిరిధర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట తహసిల్దార్ ఏ.వి రమణమ్మ గారు, ఖాజీపేట డిప్యూటీ ఎం.పీ.డి.ఓ ఏ. గిరిధర్ గారు, ఐ.సి.డి.ఎస్. సూపెర్వైజర్ పి.భారతి గారు, వెలుగు ఏ.పి.ఎం జి.శైలజ గారు, చెములపల్లి జీ.ఎం.ఎస్.కె జె.డి జ్యోష్న గారు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story