Rayachoti: SASCI పథకం కింద రాయచోటి నియోజకవర్గంలో 12 రోడ్ల నిర్మాణానికి నిధులు!
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో రూ. 2.15 కోట్ల SASCI నిధులతో 12 గ్రామీణ రోడ్ల నిర్మాణానికి చర్యలు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి.
Rayachoti: SASCI పథకం కింద రాయచోటి నియోజకవర్గంలో 12 రోడ్ల నిర్మాణానికి నిధులు!
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న SASCI పథకం కింద రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను అందిస్తోందని, ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ లో పాడైపోయిన పంచాయతీరాజ్ రోడ్ల పునర్నిర్మాణానికి, కొత్త సీసీ, తారు రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు.
రాయచోటి - గాలివీడు RKT రోడ్డు పనులు వేగవంతం:
ఇందులో భాగంగా రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి - గాలివీడు RKT నుండి పాత సైకంవారిపల్లి వరకు వెళ్లే 8 కి.మీ. రహదారిని రూ. 2.15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు. 6 నెలల కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ BT లేయర్ వేస్తున్నారని తెలిపారు.
రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 12 రోడ్ల నిర్మాణానికి SASCI నిధులు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు. ఈ రోడ్ల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడి, రైతులు తమ పంట ఉత్పత్తులను సులభంగా మార్కెట్ కు తరలించుకోవడానికి వీలవుతుందని, గ్రామాల అభివృద్ధికి ఈ రోడ్లు ఎంతగానో దోహదపడతాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.




