Rayachoty: సొంతింటి లబ్ధిదారులకు డెడ్‌లైన్.. మంత్రుల షాకింగ్ వార్నింగ్!

Rayachoty: రాయచోటి దిగువ అబ్బవరం ఎన్టీఆర్ లేఅవుట్‌లో మంత్రుల పర్యటన.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 4 May 2026 9:36 AM IST
Rayachoty
X

Rayachoty: సొంతింటి లబ్ధిదారులకు డెడ్‌లైన్.. మంత్రుల షాకింగ్ వార్నింగ్!

రాయచోటి: ఆదివారం సాయంత్రం రాయచోటి రూరల్ మండల పరిధిలోని దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఔట్‌లో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మరియు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లేఔట్ మొత్తం విస్తీర్ణం, ప్లాట్ల సంఖ్య, మంజూరైన గృహాలు, పూర్తయిన ఇండ్లు, వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాల ప్రగతి, అలాగే రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, కాలువలు తదితర మౌలిక సదుపాయాలపై మంత్రులు క్షుణ్ణంగా పరిశీలించారు.

సదరు లేఔట్ మొత్తం 2.20 ఎకరాల విస్తీర్ణంలో 120 ప్లాట్లతో ఏర్పాటు చేయబడిందని, ఒక్కో ప్లాటు 1.50 సెంట్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో మొదటి దశలో 93 మందికి గృహాలు మంజూరు చేయగా, అన్ని ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు 51 ఇండ్లు పూర్తయ్యాయని, అలాగే బిబిఎల్ దశలో 3, బిఎల్ దశలో 29, ఆర్ఎల్ దశలో 6, ఆర్‌సి దశలో 2 ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు మంత్రులకు వివరించారు.

ఈ లేఔట్ అభివృద్ధికి మొత్తం రూ.167.40 లక్షలు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.117.39 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదనంగా రహదారుల అభివృద్ధి, నీటి సౌకర్యాల కోసం రూ.12.29 లక్షలు వ్యయం చేసినట్లు తెలిపారు. అనంతరం మంత్రులు లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసి ప్లాట్లు కేటాయించడమే కాకుండా, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. ఇప్పటికే లేఔట్‌లో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని, తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇళ్లు మంజూరై కూడా నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని, నిజంగా అవసరం లేకపోతే ప్రభుత్వానికి తెలియజేస్తే అర్హులైన ఇతర పేద కుటుంబాలకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం 2026 సెప్టెంబర్‌తో ముగుస్తుందని, ఆలోపు గృహ నిర్మాణం పూర్తి చేయని వారికి తర్వాత ప్రభుత్వ ఆర్థిక సహాయం అందే అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన నిధులను వినియోగించుకుని నిర్మాణం పూర్తి చేయాలని, లేకపోతే తీసుకున్న నిధులను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చని హెచ్చరించారు.

గృహ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు, చెల్లింపుల విషయంలో సమస్యలు ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని, ప్రతి 10–15 రోజులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో స్థలాలు కేటాయించడంతో కొంతమంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను పరిశీలిస్తోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థల కేటాయింపు అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంక్షేమంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని, భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లబ్ధిదారులందరూ తమ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకునేలా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… రాయచోటి సమీపంలోని ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీని ఆదర్శవంతమైన గృహ నిర్మాణ కాలనిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాలనీలో ఇప్పటికే రూ.2 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, నీటి పైప్‌లైన్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాయచోటి పట్టణ పరిసర ప్రాంతాల్లో విలువైన ప్రదేశాల్లో ఇంటి స్థలం, గృహ నిర్మాణం మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో మంజూరైన గృహాల విషయంలో ఎదురైన సమస్యలు, చెల్లింపులు, పత్రాల సమస్యలు ఉన్నా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాయచోటిలోని అన్ని కాలనీలతో పోలిస్తే ఎన్టీఆర్ కాలనీ అత్యంత విలువైన ప్రాంతంలో ఉందని, ప్రస్తుతం ఇక్కడ స్థలాల మార్కెట్ విలువ లక్షల్లో ఉందన్నారు. కాలనీలో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మిగిలిన మౌలిక సదుపాయాలను కూడా వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు.

రాయచోటి ప్రాంతంలో భూగర్భ జలాల కొరత ఉన్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారంగా వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అబ్బవరం గ్రామం సహా పరిసర ప్రాంతాలకు అందించే చర్యలు చేపట్టామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.450 కోట్లతో చేపడుతున్న తాగునీటి ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాదికల్లా ఇంటింటికీ కొళాయిల ద్వారా నీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం స్థలం, రూ.1.80 లక్షల ఆర్థిక సహాయం, ఉచిత ఇసుక, ఉపాధి హామీ పథకం అనుసంధానం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనపు సబ్సిడీ వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

భవిష్యత్తులో రాయచోటి పరిసర ప్రాంతాల్లో మరిన్ని ప్రభుత్వ లేఅవుట్లు అభివృద్ధి చేసి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, విద్యా సహాయం, రైతు సంక్షేమ పథకాలు వంటి అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని పేర్కొన్నారు.

రాయచోటి ప్రజలకు ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, మౌలిక వసతులు, తాగునీటి సరఫరా విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story