Mydukur: మైదుకూరులో ఆగని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు: రైతు సంఘం ఫైర్!
Mydukur: మైదుకూరు నియోజకవర్గంలో రోజూ రాగి వైర్ల దోపిడీ. శ్రీనగరంలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం. దొంగల ముసుగులపై రైతు సేవా సమితి అధ్యక్షుడు ఏవీ. రమణ తీవ్ర అభ్యంతరం.
Mydukur: మైదుకూరులో ఆగని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు: రైతు సంఘం ఫైర్!
మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ప్రతిరోజూ ఏదో ఒక గ్రామంలో రైతుల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్టార్టర్ల నుండి మోటార్ల వరకు ఉన్న కాపర్ (రాగి) వైర్లు దోపిడీకి గురవుతుంటే, రైతులకు రక్షణ కల్పించడంలో పాలకులు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవీ. రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డు శ్రీనగరం సమీపంలో, ప్రధాన రహదారి పక్కనే ఉన్న రైతు పందిటి రంగయ్య పొలంలో గురువారం రాత్రి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దోపిడీకి గురైంది. శనివారం ఉదయం 11 గంటల సమయంలో రైతు సేవా సమితి బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించింది.
ఈ సందర్భంగా ఏవీ. రమణ మాట్లాడుతూ ప్రజాధనాన్ని దోచుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన వారికి రాత్రనక, పగలనక పోలీసులతో భారీ రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వాలు, అహోరాత్రులు ప్రజల కోసం శ్రమించే అన్నదాత దోపిడీకి గురవుతుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతుల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
దొంగల ముసుగులపై తీవ్ర అభ్యంతరం:
దోపిడీ దొంగలు పోలీసులకు దొరికినప్పుడు వారి తలలకు ముసుగులు వేసి కోర్టుకు తీసుకెళ్లడంపై రమణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్య దొంగలకు రక్షణ కల్పించేలా ఉందన్నారు. అలా ముసుగులు వేయకుండా ప్రజల మధ్య, రైతుల మధ్య కోర్టుకు తీసుకెళ్తే దొంగలను రైతులు సులభంగా గుర్తించగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్, చాపాడు మండల నాయకులు రాయని రామకృష్ణ, సీనియర్ రైతు నాయకులు గోశెట్టి రమణయ్య, మూల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు.




