Mydukur: ఘనంగా ప్రారంభమైన ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం
Mydukur: మైదుకూరులో ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమాన్ని CSO ఆదిశేష రెడ్డి ప్రారంభించారు. సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడమే లక్ష్యం.
Mydukur: ఘనంగా ప్రారంభమైన ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం
మైదుకూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను అర్హులైన ప్రతి కుటుంబానికి నేరుగా చేరవేయడంతో పాటు, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే లక్ష్యంతో మైదుకూరు నియోజకవర్గంలో “పేదల సేవలో 2.0” కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. మైదుకూరు పట్టణంలోని స్త్రీ శక్తి భవన్ వేదికగా వినాయక నగర్, నంద్యాల రోడ్, సీతారామాంజనేయ పురం సచివాలయాల పరిధిలోని లబ్ధిదారులతో ఈ సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు CSO శ్రీ బి. ఆదిశేష రెడ్డి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. పథకాలపై అవగాహన, ఆర్థిక-సామాజిక సాధికారత, అర్హులైన వారికి చేయూత, ప్రజా సమస్యల పరిష్కారం అనే నాలుగు ప్రధాన అంశాలపై ఈ విడతలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమం 2026 అక్టోబర్ 1 నుంచి 2027 డిసెంబర్ 31 వరకు దాదాపు 15 నెలల పాటు అన్ని గ్రామాలు, వార్డు సచివాలయాల పరిధిలో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అర్హత ఉండి ఏ ఒక్కరూ పథకాలకు దూరం కాకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
మైదుకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ రంగస్వామి మాట్లాడుతూ, వార్డు సభలు మరియు సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి, సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరిస్తామని, ఇతర సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలందరూ గ్రామ, వార్డు సభల్లో పాల్గొని సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైదుకూరు పట్టణ అధ్యక్షులు, కనీస వేతనాల డైరెక్టర్ దాసరి బాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ బి.ఎన్. శ్రీను, నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ వినోద్ కుమార్ పువ్వాడి, నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మెప్మా సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.




