Kadapa: కడప నుంచి సంగం వరకు ఫిల్మీ స్టైల్ కార్ చేజింగ్!
Kadapa: హైదరాబాద్‌లో కారును అద్దెకు తీసుకుని పరారైన ముఠాను నెల్లూరు జిల్లా సంగం పోలీసులు ఫిల్మీ స్టైల్‌లో చేజ్ చేసి పొలాల్లో వదిలేసిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Kadapa: కడప నుంచి సంగం వరకు ఫిల్మీ స్టైల్ కార్ చేజింగ్!
Kadapa: హైదరాబాద్‌లో అద్దెకు తీసుకున్న కారును తిరిగి అప్పగించకుండా పరారైన కేడీల ముఠా వ్యవహారం చివరకు నెల్లూరు జిల్లా సంగం పోలీసుల చాకచక్యంతో కొలిక్కి వచ్చింది. కడప నుంచి సంగం వరకు సాగిన ఉత్కంఠభరితమైన చేజింగ్‌లో సంగం ఎస్సై భోజ్యా నాయక్ తన సిబ్బందితో సమయస్ఫూర్తిగా స్పందించి, పొలాల్లో వదిలేసిన రెంట్ కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 8వ తేదీ రాత్రి హైదరాబాద్‌కు చెందిన సాయిచంద్ వద్దకు హమీద్ అనే యువకుడు వచ్చి లాంగ్ డ్రైవ్ కి తన డాక్యుమెంట్లు సమర్పించి కారును అద్దెకు తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం 9వ తేదీ నాటికి కారును తిరిగి అప్పగించాల్సి ఉండగా, హమీద్ తిరిగి రాకపోవడంతో యజమాని అతనికి ఫోన్ చేశాడు. అయితే ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడంతో అనుమానం వ్యక్తం చేసిన సాయిచంద్ వెంటనే హైదరాబాద్ లోని మీర్ పేట పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కారు జీపీఎస్ లొకేషన్‌ను పరిశీలించగా, వాహనం వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో కారు యజమాని సాయిచంద్ కడపకు చేరుకుని జీపీఎస్ ఆధారంగా వాహనం ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అయితే యజమానిని గమనించిన నిందితులు వెంటనే కారుతో అక్కడి నుంచి పరారయ్యారు.సాయిచంద్ కూడా తన కారులో నిందితుల వాహనాన్ని వెంబడిస్తూ కడప నుంచి నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైపు ఛేజ్ చేశారు. ఈ క్రమంలో డీసీ పల్లి టోల్‌గేట్ వద్ద నిందితుల కారు పక్కగా ఢీకొని, అక్కడి నుంచి వేగంగా సంగం వైపు దూసుకెళ్లింది.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన కారు యజమాని వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంగం ఎస్సై భోజ్యా నాయక్ వెంటనే అప్రమత్తమై, ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి సమయంలో తన సిబ్బందితో రంగంలోకి దిగారు. నిందితుల వాహనం కోసం పోలీసులు ఛేజింగ్ ప్రారంభించారు.
పోలీసుల ఛేజింగ్‌ను గుర్తించిన నిందితులు బుచ్చి టోల్‌గేట్ వైపు వెళ్లి, అక్కడి నుంచి అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. అనంతరం దువ్వూరు గ్రామం వైపు దూసుకెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో చీకటిని ఆసరాగా చేసుకుని కారును పొలాల్లో వదిలేసి పరారయ్యారు.వెంటనే రంగంలోకి దిగిన సంగం పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని రికవరీ చేసి యజమాని సాయిచంద్‌కు అప్పగించారు.అనంతరం మీర్ పేట పోలీస్ లకు సమాచారం అందించారు.
కారు యజమాని సాయిచంద్‌కు చెందిన వాహనాన్ని వేగంగా స్పందించి స్వాధీనం చేయడంలో కీలకంగా వ్యవహరించిన సంగం ఎస్సై భోజ్యా నాయక్, పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కడప నుంచి సంగం వరకు సాగిన ఈ చేజింగ్‌లో పోలీసులు వేగంగా స్పందించి వాహనాన్ని సురక్షితంగా రికవరీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




