Proddatur: ప్రొద్దుటూరులో బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్
Proddatur: ప్రొద్దుటూరు తాళ్లమాపురం పరిధిలో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి:
Proddatur: ప్రొద్దుటూరులో బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్
ప్రొద్దటూరు: విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తాళ్లమాపురం పంచాయతీ పరిధిలోని SRIT కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఆదివారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను ప్రారంభించారు.
కార్యక్రమానికి రాజకీయ, సామాజిక, విద్యా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అత్యుత్తమ విద్యను అభ్యసించడం ఎంతో అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నగరాలకు ఏమాత్రం తీసిపోని విద్యా సదుపాయాలు అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యార్థులలో జ్ఞానంతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించే విద్యాసంస్థల అవసరం ప్రస్తుతం మరింత పెరిగిందన్నారు. సీఎం సురేష్ నాయుడు మాట్లాడుతూ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి దోహదపడ తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ సౌత్ హెడ్ సందీప్ మాట్లాడుతూ, విద్యార్థులను కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులుగా కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.
ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత విద్య, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా బిర్లా ఓపెన్ మైండ్స్ విద్యాసంస్థలు విశిష్ట గుర్తింపు పొందాయని, అదే స్థాయి ప్రమాణాలను తాళ్లమాపురం కేంద్రంలో కూడా అమలు చేస్తామని చెప్పారు. స్కూల్ కరస్పాండెంట్ శ్వేత బసిరెడ్డి మాట్లాడుతూ, స్థానిక విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలను అందించాలనే సంకల్పంతో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే విధంగా ప్రత్యేక బోధనా కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలను అందించనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.
హెడ్‌మాస్టర్ సత్యలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థుల మేధో వికాసంతో పాటు వారి భావోద్వేగ, సామాజిక వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు ఆధునిక తరగతి గదులు, స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాలు, క్రీడా వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని వివరించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తియార్, టీడీపీ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి, కమాల్ బాష, తలారి పుల్లయ్య, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, నాయకులు శంకరాపురం ప్రసాద్ రెడ్డి, మండ్ల మల్లికార్జున, జనసేన నాయకుడు మంచి శివకుమార్‌తో పాటు స్కూల్ యాజమాన్య సభ్యులు బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, వీర కుమార్ రెడ్డి, వీర కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం అతిథులు పాఠశాల భవనం, తరగతి గదులు, విద్యార్థులకు అందుబాటులో ఉంచిన విద్యా సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం కల్పించిన మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను అభినందిస్తూ, ఈ విద్యాసంస్థ రానున్న రోజుల్లో ప్రాంతీయ విద్యా అభివృద్ధికి ఒక కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగింపులో అతిథులను యాజమాన్యం సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది.




