Proddatur: 104 ఏళ్ళ చరిత్ర ఉన్న బ్యాంకు.. ఏనాడూ మచ్చ లేని బ్యాంకు!
Proddatur: ది ప్రొద్దుటూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు రాజకీయ ఆధిపత్య పోరుతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బ్యాంక్ అధ్యక్షులు బొగ్గుల సుబ్బారెడ్డి మండిపడ్డారు.
Proddatur: 104 ఏళ్ళ చరిత్ర ఉన్న బ్యాంకు.. ఏనాడూ మచ్చ లేని బ్యాంకు!
Proddatur: ఆర్బీఐ, సహకార శాఖ నిబంధనల ను అనుసరించి గత శతాబ్దానికి పైగా ది ప్రొద్దుటూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ను దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ అధ్యక్షులు బొగ్గుల సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 104 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సహకార బ్యాంక్ పూర్తిగా ఆర్బీఐ, సహకార శాఖ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నిర్వహణ కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగానే కొందరు ఉద్దేశపూర్వకంగా బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బ్యాంక్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రుణాల మంజూరులో ఎలాంటి అవకతవకలకు తావులేదని, అన్ని నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే లోన్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా ఇండివిజువల్ రూమ్ రిజిస్ట్రేషన్, లీగల్ ఒపీనియన్, ఆస్తుల వాల్యూషన్, పన్నుల చెల్లింపులు, సంబంధిత డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం మాత్రమే రుణాలను ఆమోదిస్తున్నామని చెప్పారు.
ఈఎంఐలు సకాలంలో చెల్లించని రుణగ్రహీతలపై నిబంధనల ప్రకారం అదనపు వడ్డీతో వసూళ్లు చేపడుతున్నామని వెల్లడించారు. బ్యాంక్ ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయని, డిపాజిటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన భరోసా ఇచ్చారు. ఎస్‌ఎస్ మాల్‌కు సంబంధించి రూముల యజమానుల పేరుతోనే రుణాలు మంజూరు చేశామని, తమతో పాటు ఇతర బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చారని తెలిపారు. సంబంధించిన రూ.2.5 కోట్ల బకాయిలు పూర్తిగా చెల్లించబడినట్లు స్పష్టం చేసిన ఆయన, ఆ అంశాన్ని వక్రీకరించి ప్రచారం చేయడం బాధాకరమన్నారు. టౌన్ బ్యాంక్‌పై నిరాధార ప్రచారాలు చేసి డిపాజిటర్లలో అయోమయం సృష్టించవద్దని అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసమే బ్యాంక్‌కు బలమని, శతాబ్ద కాలంగా సేవలందిస్తున్న సంస్థ ప్రతిష్టను కాపాడేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. టౌన్ బ్యాంకు సీఈఓ నిరంజన్ రెడ్డి, డైరెక్టర్లు సురేంద్ర, గంగాధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.




