Kadapa: భర్త హత్యకు భార్య స్కెచ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!
Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేందుకు 14 తులాల బంగారం సుపారీ ఇచ్చిన భార్య, ఆమె ప్రియుడు సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శిల్ప రెడ్డి - నాగ సుధీర్
Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక కిరాయి హత్యాయత్నం కుట్రను వన్‌టౌన్ పోలీసులు భగ్నం చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భర్తనే అంతమొందించాలని చూసిన భార్య, ఆమె ప్రియుడు మరియు కిరాయి ముఠా సభ్యులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి–శిల్పారెడ్డి దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, శిల్పారెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేసే నాగ సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శిల్పారెడ్డి, ప్రియుడితో కలిసి ఈశ్వరరెడ్డిని చంపాలని ప్లాన్ వేసింది.
హత్య చేయడానికి శిల్పారెడ్డి తన వద్ద ఉన్న 14 తులాల బంగారాన్ని ప్రియుడికి ఇచ్చింది. ఆ బంగారాన్ని అమ్మి మరియు కుదవపెట్టి సుమారు 10 లక్షల రూపాయలను పోగు చేశారు. స్థానిక రౌడీషీటర్ వినయ్ సహకారంతో హిందూపురానికి చెందిన ఒక కిరాయి ముఠాను ఒప్పించారు.
నిందితులు ఈశ్వరరెడ్డిని చంపేందుకు రెండు ప్లాన్లు వేశారు. బైక్‌పై వెళ్తున్నప్పుడు కారుతో ఢీకొట్టి, కత్తులతో దాడి చేయడం. అది కుదరకపోతే పొలంలో పని చేస్తున్నప్పుడు మూకుమ్మడిగా దాడి చేయడం. ప్లాన్ ప్రకారం, ఈశ్వరరెడ్డి బైక్‌పై వెళ్తుండగా కిరాయి ముఠా కారుతో బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న ఈశ్వరరెడ్డి, వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి, గురువారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు శిల్పారెడ్డి, నాగ సుధీర్, రౌడీషీటర్ వినయ్‌తో పాటు హిందూపురం ముఠాకు చెందిన మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. హత్యకు వాడిన వాహనం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.




