Proddatur: ప్రొద్దుటూరులో వైసీపీ నామినేషన్ల తొలగింపుపై రాచమల్లు ఆగ్రహం

Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో వైసీపీ నామినేషన్లను అక్రమంగా తొలగించారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు; తీవ్ర హెచ్చరిక.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 Nov 2026 5:31 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో వైసీపీ నామినేషన్ల తొలగింపుపై రాచమల్లు ఆగ్రహం

ప్రొద్దుటూరు: ​వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రొద్దుటూరు మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో ప్రజలకు ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేశామని ఆయన తెలిపారు.

​అయితే, నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సమయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే ఉంచి, వైసీపీ నామినేషన్లను అక్రమంగా తొలగించారని రాచమల్లు ఆరోపించారు. అధికార టీడీపీ నేతలు ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఎన్నికల కమిషన్ మరియు పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అమ్ముడుపోయాయని ఆయన విమర్శించారు.

​ప్రజాస్వామ్య విరుద్ధంగా దక్కించుకున్న పదవులతో టీడీపీ నేతలు తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా నేరుగా నామినేట్ చేసే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎన్నికల విధులు నిర్వహించిన ఏ ఒక్క అధికారి కూడా ఉద్యోగంలో ఉండరని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR