Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రేసులో చేనేత కౌన్సిలర్లు
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి చేనేతలకే ఇవ్వాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కోరిన 12 మంది కౌన్సిలర్లు. బీసీ ప్రాతినిధ్యంపై తీవ్ర చర్చ.
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రేసులో చేనేత కౌన్సిలర్లు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో, ఈ పదవి ఏ సామాజిక వర్గానికి దక్కుతుందనే దానిపై స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని తమ చేనేత సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ 12 మంది చేనేత వర్గానికి చెందిన కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని కలిశారు.
పట్టణంలో చేనేత అధికంగా ఉండే విషయమై ఈసారి వైస్ చైర్మన్ అవకాశం తమ సామాజిక వర్గానికే ఇవ్వాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. చేనేత కౌన్సిలర్ల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సానుకూలంగా స్పందించారు. చేనేత సామాజిక వర్గం పట్ల తనకు ఎప్పుడూ ప్రత్యేక అభిమానం ఉంటుందని, వారి అభ్యర్థనను సానుకూలంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో చేనేత వర్గానికి చెందిన కౌన్సిలర్లు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మొత్తం 52 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో ఏకంగా 29 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ ఉండటం విశేషం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,57,000 మందిలో
బీసీ ఓటర్లు సుమారు 60,000 మంది ఉండగా కౌన్సిలర్లలోనూ, ఓటర్ల సంఖ్యలోనూ బీసీల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నందున, తప్పకుండా వైస్ చైర్మన్ పదవి బీసీలకే దక్కుతుందనే వార్తలు పట్టణ ప్రజల్లో విస్తృతంగా ప్రచారమవుతు తీవ్ర చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, అత్యధిక సంఖ్యాబలం ఉన్న బీసీ వర్గానికే వైస్ చైర్మన్ పీఠం లభిస్తుందా? లేక చేనేత వర్గానికి ఎమ్మెల్యే ఇచ్చిన మాట అమలులోకి వస్తుందా? అనేది వేచి చూడాల్సిందే...




