Rayachoti: రాయచోటిలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు
Rayachoti: రాయచోటిలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్ చేసిన AISP రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల లవకుమార్.
Rayachoti: రాయచోటిలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు
రాయచోటి: దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహా విప్లవ యోధుడు షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయనకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ (AISP) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల లవకుమార్ రాయచోటి కార్యాలయం నందు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం, ఆయన ఆలోచనలు నేటి విద్యార్థులు, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. చిన్న వయస్సులోనే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన భగత్ సింగ్, యువతలో చైతన్యం, ధైర్యం, ప్రశ్నించే తత్వం పెంపొందించేందుకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
నేటి సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజుల భారం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం, స్కాలర్‌షిప్ సమస్యలు, ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత, నిరుద్యోగం, విద్యా రంగంలో పెరుగుతున్న ఆర్థిక భారం వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు విద్య అందుబాటులో లేకుండా చేసే పరిస్థితులు ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు తమ సమస్యలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన హక్కు అని, వారి గొంతును వినడం ద్వారా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
భగత్ సింగ్‌ను కేవలం జయంతి రోజున స్మరించుకోవడం కాకుండా, ఆయనలోని అధ్యయనాసక్తి, శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని యువత అలవర్చుకోవాలి అని పిలుపునిచ్చారు.
విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం AISP నిరంతరం ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తుందని, విద్యార్థుల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.భగత్ సింగ్ ఆశయ సాధనకు విద్యార్థి, యువజన పోరాటాల ద్వారానే ఆశయాలు సాధించవచ్చు అన్నారు. నేటి యువత భగత్ సింగ్ చరిత్ర తెలుసుకొని వారి బాటలో నడవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ అరవింద్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.




