Rayachoti: రాయచోటి అభివృద్ధికి రూ. 244.32 కోట్ల భారీ నిధులు!

Rayachoti: రాయచోటి పట్టణాభివృద్ధికి రూ. 244.32 కోట్ల భారీ నిధులు మంజూరు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధికి పెద్దపీట: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 21 Sept 2026 10:20 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి అభివృద్ధికి రూ. 244.32 కోట్ల భారీ నిధులు!

రాయచోటి: రాయచోటి పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్న రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పథకాల కింద మొత్తం రూ.244.32 కోట్ల విలువైన పనులకు నిధులు కేటాయించబడినట్లు మంత్రి మండిపల్లి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా సురక్షితమైన తాగునీటి సరఫరా, నీటి వనరుల పునరుద్ధరణ, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ, ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ, నాణ్యమైన రహదారులు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.

అమృత్ 2.0 పథకం కింద తాగునీటి సరఫరా, నీటి వనరుల పునరుద్ధరణకు రూ.3.68 కోట్లు కేటాయించగా, పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. SBM 2.0 కింద ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ.4.96 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపుల ద్వారా రోడ్లు, డ్రైన్లు, పూడికతీత పనులకు రూ.3.68 కోట్లు కేటాయించారు. ఈ మూడు విభాగాల్లో ప్రస్తుతం జరుగుతున్న పనుల మొత్తం విలువ రూ.12.32 కోట్లు.

భవిష్యత్ పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కీలక పనులకు కూడా నిధులు కేటాయించారు. HAM విధానం ద్వారా రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాల కోసం రూ.35 కోట్లు కేటాయించగా, ఈ పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి.

అత్యంత ప్రాధాన్యత కలిగిన UIDF-IV పథకం కింద రాయచోటి పట్టణంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి రూ.197 కోట్లు కేటాయించారు. ఈ పనులు ప్రస్తుతం పాలనా అనుమతుల దశలో ఉన్నాయి.

దీంతో రాయచోటి పట్టణానికి వివిధ పథకాల కింద కేటాయించిన నిధుల మొత్తం రూ.244.32 కోట్లకు చేరింది. రాయచోటి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయింపు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ లకు మంత్రి మండిపల్లి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తూ, చేపట్టిన పనులను నిర్ణీత సమయంలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

రాయచోటి పట్టణాన్ని మరింత అభివృద్ధి చెందిన, మెరుగైన మౌలిక వసతులతో కూడిన పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిధుల కేటాయింపు జరిగిందని ఆయన పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI