Rayachoti: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలి
Rayachoti: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు సమష్టిగా సన్నద్ధం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు. రాయచోటిలో కూటమి సమన్వయ సమావేశం నిర్వహణ.
Rayachoti: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలి
రాయచోటి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఐక్యత, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుని సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు.
రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్లో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కూటమి సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భాగస్వామ్య పక్షాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో సంస్థాగత బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించారు.
స్థానిక పరిస్థితులు, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని తెలిపారు.
గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు పరస్పర సహకారంతో ఐక్యంగా పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టంగా సన్నద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించారు.




