Rayachoti: సిమెంట్ లారీ బరువుకు విరిగిపడిన స్లాబ్.. నిలిచిన రాకపోకలు!

Rayachoti: రాయచోటి మదనపల్లి రింగ్ రోడ్డు జాతీయ రహదారిపై నాసిరకం డ్రైనేజీ నిర్మాణం వల్ల విరిగిపడిన స్లాబ్.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 27 July 2026 11:16 AM IST
Rayachoti
X

Rayachoti: సిమెంట్ లారీ బరువుకు విరిగిపడిన స్లాబ్.. నిలిచిన రాకపోకలు!

రాయచోటి: రాయచోటి పట్టణంలోని శివాలయం నుంచి మదనపల్లి రింగ్ రోడ్డు వరకు ఉన్న జాతీయ రహదారి ఇరువైపులా నిర్మించిన డ్రైనేజీ (మురికి కాలువ) వ్యవస్థ నాసిరకం నిర్మాణం, నాణ్యత లోపం కారణంగా తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన ఈ కాలువలు ప్రస్తుతం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తేలికపాటి వర్షం కురిసినప్పుడే డ్రైనేజీ కాలువలు పూర్తిగా మురికి నీటితో నిండిపోతున్నాయి. దీంతో వర్షపు నీరు రహదారిపైకి చేరి సగం వరకు నిల్వ ఉండటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఈ నీటిలో దాగి ఉన్న కాలువల అంచులను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు.

అంతేకాకుండా రహదారి పక్కన ఉన్న ఈ డ్రైనేజీ కాలువలను దాటేందుకు పలు వాహనదారులు ప్రయత్నించే సమయంలో వాహనాలు కాలువలో పడిపోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించే ఇతర వాహనాలకు కూడా ప్రమాద పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున టన్నుల కొద్దీ లోడుతో ప్రయాణిస్తున్న జువారి సిమెంట్ లారీ రహదారి పక్కన నిర్మించిన డ్రైనేజీ కాలువను దాటేందుకు ప్రయత్నించగా, కాలువపై నిర్మించిన స్లాబ్ ఒక్కసారిగా విరిగి కూలిపోయింది. దీంతో లారీ అక్కడే నిలిచిపోవడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన నాసిరకం నిర్మాణ పనులకు మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని స్థానికులు పేర్కొంటున్నారు.

డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, తగిన బలం లేని స్లాబ్‌లు ఏర్పాటు చేయడం, భారీ వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకోకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత జాతీయ రహదారి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్ట్ సంస్థలు వెంటనే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించి నాణ్యమైన నిర్మాణాలతో పునర్నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, డ్రైనేజీపై నిర్మించిన స్లాబ్‌లు భారీ వాహనాల బరువును తట్టుకునే సామర్థ్యం లేనందున, ట్రక్కులు, లారీలు, ఇతర భారీ వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ఇటువంటి నిర్మాణాలపై ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని వాహనదారులు సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదకర ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story