Rayachoti: శాశ్వత తాగునీటి భరోసా - మంత్రి మండిపల్లి రాంప్రసాద్
Rayachoti: రాయచోటిలో శాశ్వత తాగునీటి భరోసా కల్పించేలా రూ.2,370 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Rayachoti: శాశ్వత తాగునీటి భరోసా - మంత్రి మండిపల్లి రాంప్రసాద్
రాయచోటి: రాయచోటి నియోజకవర్గ ప్రజలకు శాశ్వత తాగునీటి భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి ప్రాంతంలో తాగునీటి మౌలిక వసతులను సమూలంగా బలోపేతం చేసేందుకు ఒకవైపు రూ.2,370 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా, మరోవైపు జల్ జీవన్ మిషన్ 2.0లో రూ.28.78 కోట్లతో 49 తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ రెండు కార్యక్రమాల ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని వందలాది ఆవాసాలకు, లక్షలాది మంది ప్రజలకు తాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించడంతో పాటు, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత తాగునీటి మౌలిక వసతులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
రూ.2,370 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టు
జల్ జీవన్ మిషన్‌లో భాగంగా చేపడుతున్న పశ్చిమ చిత్తూరు ప్రాంత సమగ్ర తాగునీటి సరఫరా ప్రాజెక్టులో రాయచోటి సెగ్మెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. రాయచోటి సెగ్మెంట్ ఫేజ్–Iలో 6 మండలాల పరిధిలోని 887 ఆవాసాలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు.
2027 నాటికి సుమారు 2.24 లక్షల జనాభాకు, 2057 నాటికి 2.64 లక్షల జనాభాకు తాగునీటి అవసరాలను తీర్చేలా ప్రాజెక్టును రూపొందించారు. మొత్తం 37,781 కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.
వెలిగల్లు జలాశయం నుంచి 0.327 టీఎంసీల నీటిని తీసుకుని, 26 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం ద్వారా శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేయనున్నారు. ఇందులో భాగంగా ఇంటేక్ వెల్, క్లియర్ వాటర్ సంపులు, ఓహెచ్‌బీఆర్‌లు, బీపీటీలు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
156.73 కిలోమీటర్ల పైప్‌లైన్ పూర్తి
రూ.2,370 కోట్ల అంచనా వ్యయం కలిగిన ఈ ప్రాజెక్టుకు రూ.1,939.42 కోట్ల ఒప్పంద విలువ ఉంది. 2025 ఏప్రిల్ 7న ఒప్పందం కుదరగా, 2027 అక్టోబర్ 6 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాయచోటి ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం!...
రాయచోటి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నీరు.. ప్రతి ఆవాసానికి కుళాయి.. ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పం. గతంలో నిలిచిపోయిన పనులను పునరుద్ధరించడంతో పాటు, భవిష్యత్ అవసరాలను తీర్చేలా భారీ సమగ్ర తాగునీటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాం. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యాన్ని అందిస్తాం అని మంత్రి స్పష్టం చేశారు.
రాయచోటి ప్రజల చిరకాల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్న ఈ కార్యక్రమాలు చరిత్రలో కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.




