Rayachoty: రాయచోటిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం!

Rayachoty: రాయచోటిలో KIMS–SAVEERA ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Aug 2026 2:22 PM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం!

Rayachoty: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీ స్త్రీ శక్తి భవన్‌లో KIMS–SAVEERA ఆసుపత్రి, అనంతపురం ఆధ్వర్యంలో గుండె, క్యాన్సర్ వ్యాధులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి రాయచోటి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీమతి హరితమ్మ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షల వివరాలను తెలుసుకున్నారు.

గుండె, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని హరితమ్మ పేర్కొన్నారు.ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్య పరీక్షలు భారంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.వైద్య శిబిరంలో KIMS–SAVEERA ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు.

పలువురు రోగులను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిపై సూచనలు, సలహాలు అందించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య చికిత్సకు సంబంధించి మార్గనిర్దేశం చేశారు.ఈ మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం కావడానికి విశేషంగా కృషి చేసిన టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు సాహుద్ బాష, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ మురికినాటి వెంకట సుబ్బారెడ్డిలకు ప్రజలు, వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.క్యాంప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య శిబిరానికి చేరుకోవడంతో స్త్రీ శక్తి భవన్ పరిసరాల్లో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్,డీలర్ ఆరిఫ్ ఖాన్ 12వ వార్డు కౌన్సిలర్ ఇంచార్జ్ మదన్, మైనార్టీ మహిళా నాయకురాలు భాను, ప్రభుత్వ ఆసుపత్రి మెంబర్ మరియు టీడీపీ నాయకురాలు లక్ష్మీదేవి, అమీర్, సబ్జాన్, సాయి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందేలా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరం రాయచోటిలో విజయవంతంగా కొనసాగి, ప్రజలకు వైద్య సేవలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించిన కార్యక్రమంగా నిలిచింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story