Lakkireddypalli: 48 గంటల్లోనే గాలివీడు భారీ చోరీ కేసు ఛేదన!
Lakkireddypalli: అన్నమయ్య జిల్లా గాలివీడులో భూ వివాదాల కక్షతో ఇంట్లో చొరబడి 210 గ్రాముల బంగారం చోరీ.
Lakkireddypalli: 48 గంటల్లోనే గాలివీడు భారీ చోరీ కేసు ఛేదన!
Lakkireddypalli: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో జరిగిన భారీ గృహ చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.*గారి ఆదేశాల మేరకు పక్కా వ్యూహంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేశారు. సోమవారం లక్కిరెడ్డిపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను పత్రికా ముఖంగా వెల్లడించారు.
బాధితులు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి గురువారం లక్కిరెడ్డిపల్లి మండలం కోణంపేట సంతకు వెళ్లి, అక్కడే రాత్రి బస చేసి మరుసటి రోజు ఇంటికి రావడం వారి దినచర్య. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 8:30 గంటలకు సంతకు వెళ్లిన దంపతులు, 17వ తేదీ ఉదయం 10:00 గంటలకు గాలివీడులోని తమ ఇంటికి చేరుకున్నారు.
ఇంటి వెనుక తలుపులు, బీరువా తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. బీరువాలో భద్రపరిచిన కుటుంబ సభ్యులకు (కుమారుడు, కోడలు, మనవడు, మరదలు, అల్లుడు, భార్య) చెందిన సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించి, వెంటనే గాలివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీస్ స్టేషన్లో కేసు (క్రైమ్ నంబర్ 162/2026) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ ఎం.ఆర్.కృష్ణమోహన్ పర్యవేక్షణలో లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్.కృష్ణంరాజు నాయక్ రంగంలోకి దిగారు.
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, 20.07.2026 ఉదయం గాలివీడు మండలం, పేరంపల్లి గ్రామం, రెడ్డివారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 210 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, నేరానికి ఉపయోగించిన కేటీఎం (KTM 125 Duke) మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో గాలివీడుకు చెందిన డ్రైవర్ చెప్పలి కాశి (24), తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఎలక్ట్రీషియన్ మారిశెట్టి సాయికుమార్ (20) ఉన్నారు. ప్రధాన నిందితుడు (A1) కాశికి, బాధితులకు మధ్య ఉన్న కుటుంబ భూవివాదాలే ఈ చోరీకి ప్రధాన కారణం.
పాత కక్షను మనసులో పెట్టుకుని బాధితులను ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే కాశి ఈ చోరీకి పథకం పన్నాడు. అవకాశం కోసం వేచి చూసిన నిందితుడు, బాధితులు గురువారం ఇంట్లో ఉండరనే విషయాన్ని గమనించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మొదట నేరానికి నిరాకరించిన తన స్నేహితుడైన (A2) సాయికుమార్‌ను కూడా ప్రలోభపెట్టి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు.
కేసు నమోదైన 48 గంటల్లోనే సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన పనితీరుతో నిందితులను పట్టుకున్న లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్.కృష్ణంరాజు నాయక్, గాలివీడు ఎస్సై జె.నరసింహారెడ్డి, మరియు వారి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.




