Rayachoty: మంత్రి మండిపల్లికి సంబంధం లేదు.. బాధితులు
Rayachoty: రాయచోటి స్థల వివాదంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని బాధితులు ఆదినారాయణ రెడ్డి దంపతులు స్పష్టం చేశారు.
Rayachoty: మంత్రి మండిపల్లికి సంబంధం లేదు.. బాధితులు
Rayachoty: మా స్థల వివాదంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జోక్యం లేదని, దశరథ రామి రెడ్డి పై జరిగిన దాడి ఘటనకు తమకు గానీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి, ఆయన అనుచరులకు ఎలాంటి సంబంధం లేదని స్థల యజమాని రిటైర్డ్ డిఈ ఆదినారాయణ రెడ్డి, సుమన దంపతులు తెలిపారు. సోమవారం వారు రాయచోటి పట్టణంలోని చిత్తూరు రింగ్ రోడ్డు లో సర్వే నెంబర్ 553 లో 50 స్థలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గత నాలుగేళ్ల నుంచి తమ స్థలం తమకు అప్పజెప్పకుండా గత వైసిపి ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులతో, ఆయన అనుచరులతో దశరథరామిరెడ్డి,
ఆయన సతీమణి విజయమ్మ లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థల వివాదంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆయన అనుచరులకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. కేవలం అగ్రనేతల దగ్గర పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతోనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన అనుచరుల పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు, కలెక్టర్ చొరవతో తమ స్థల సమస్య పరిష్కారం అయినప్పటికీ తమ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు వెళ్తే అక్కడ తమ కుటుంబ సభ్యులను బెదిరించి స్థలంలోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారన్నారు.
కోర్టు ఎన్ని స్టేలు ఇచ్చినా తమ స్థలంలోకి మీరు రాలేరని అనుచరులతో బెదిరించి గాయపరిచినట్లు మీడియా ఎదుట వాపోయారు. ప్రాణాలు తెగించి తాము తమ స్థలంలో కట్టడాలు చేపడుతున్నామన్నారు. తాము వారి పై దాడి చేసే శక్తి, సామర్థ్యాలు తమకు లేవన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ల దృష్టికి కూడా తీసుకెళ్లామని అయినా కూడా వారు తమకు ఎటువంటి న్యాయం చేయలేదని వారు వాపోయారు. తము చట్టాలను గౌరవించి స్థలం దగ్గరికి వచ్చామే తప్ప రౌడీయిజం చేసే దానికి రాలేదన్నారు.




