Rayachoti: పేదల గుండెల్లో వైఎస్సార్ చిరంజీవి: శ్రీకాంత్ రెడ్డి!
Rayachoti: అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం శెట్టిపల్లెలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Rayachoti: పేదల గుండెల్లో వైఎస్సార్ చిరంజీవి: శ్రీకాంత్ రెడ్డి!
రాయచోటి: అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలంలో శెట్టిపల్లెలో మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు శ్రీకాంత్ రెడ్డి అర్పించారు.పేదల ఆశాజ్యోతి... రైతన్నకు ఆత్మబంధువు... జలయజ్ఞానికి రూపశిల్పి అయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సంబేపల్లె మండలం శెట్టిపల్లెలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.శెట్టిపల్లెలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహానేత సంకల్పంతో సాకారమైన జరికోన ప్రాజెక్టు జలాలతో ప్రత్యేక జలాభిషేకం నిర్వహించి ఆయన జలయజ్ఞ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, అభివృద్ధి అడుగుజాడలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. రాబోయే కాలంలో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాగానే జరికోన నీటిని మండలంలోని అన్ని చెరువులకు నింపుతామన్నారు.
రైతుకు ధైర్యం... పేదలకు భరోసా!
రైతు సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేసి అన్నదాతకు అండగా నిలిచారని, పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు.కరవుతో అల్లాడుతున్న రాయలసీమకు నీటి భరోసా కల్పించాలన్న మహానేత సంకల్పమే జలయజ్ఞానికి కారణమైందన్నారు. రాయచోటి ప్రాంతానికి కీలకమైన వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన ప్రాజెక్టులు వైఎస్సార్ దూరదృష్టికి నిదర్శనాలని పేర్కొన్నారు.
వైఎస్సార్ జలయజ్ఞ సేవలను స్మరించుకుంటూ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక జలాభిషేకాలు నిర్వహించామని తెలిపారు. వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన ప్రాజెక్టుల జలాలతో వైఎస్సార్ విగ్రహాలకు అభిషేకం చేసి మహానేతకు ఘన నివాళులు అర్పించామని చెప్పారు.
మహానేత లేరు... ఆశయాలు సజీవం!
ప్రతి పేదవాడి ఇంట్లో వెలిగిన ఆశ... ప్రతి రైతు గుండెల్లో నింపిన ధైర్యం... ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు వేసిన పునాది... ప్రతి జలాశయంలో ప్రతిఫలించిన జలయజ్ఞం... ఇవన్నీ మహానేత వైఎస్సార్ చిరస్మృతులేనని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.పేదల కోసం పరితపించిన మహానేత భౌతికంగా దూరమైనా... తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ చెరగదని ఘనంగా నివాళులర్పించారు.




