Sundupalli: రోడ్డు ప్రమాదం కాదు హత్యే జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

Sundupalli: సుండుపల్లి వద్ద జూలై 22న జరిగిన జంట మరణాల కేసును హత్యగా తేల్చిన పోలీసులు. స్థల వివాదమే కారణం, ఇద్దరి అరెస్ట్, వాహనాలు స్వాధీనం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 16 Aug 2026 8:51 AM IST
Sundupalli
X

Sundupalli: రోడ్డు ప్రమాదం కాదు హత్యే జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

Sundupalli: కడప జిల్లా టి.సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద జూలై 22న జరిగిన జంట హత్యల కేసును సుండుపల్లి పోలీసులు ఛేదించారు.మొదట గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందినట్లు నమోదైన కేసు.దర్యాప్తులో హత్యగా తేలింది.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జూలై 22న చిన్నగొల్లపల్లి ప్రాంతంలో అబ్బన్నగారి జయరాం 44 సం,, రెడ్డిచెర్ల రవీంద్ర 45 సం,,లను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరూ మృతి చెందారు.

దీంతోటి సుండుపల్లి పోలీస్ స్టేషన్‌లో తొలుత హిట్ అండ్ రన్ కేసు నమోదైంది.కడప జిల్లా ఎస్పీ ఆదేశాలతో, రాజంపేట డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల వివరాల ప్రకారం... మృతుడు రవీంద్ర కుటుంబానికి, ప్రధాన నిందితుడు రెడ్డిచెర్ల శివశంకర్ కుటుంబానికి మధ్య ఇంటి స్థలానికి సంబంధించి కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది.ఈ క్రమంలో రవీంద్రను హత్య చేయాలని శివశంకర్ పథకం రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పథకం ప్రకారం తన స్నేహితులైన రెడ్లచెరువుకు చెందిన యేరికల శివప్రసాద్, సిబ్యాల గ్రామానికి చెందిన వాక శరణ్ రాజ్ అలియాస్ చరణ్,సానిపాయకు చెందిన మరో వ్యక్తి సహకారంతో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంతో జయరాం, రవీంద్రలను ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.దర్యాప్తు వేగవంతం కావడంతో చట్టపరమైన చర్యలు తప్పవని భావించిన యేరికల శివప్రసాద్, వాక శరణ్ రాజ్ ఇద్దరూ గ్రామ రెవెన్యూ అధికారి సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయారు.

అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ కేసులో ప్రధాన సూత్రధారి రెడ్డిచెర్ల శివశంకర్‌తో పాటు సానిపాయకు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.కాగా, నిందితుల నుంచి అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం, ఏపీ 39 డబ్ల్యుకే 9350, అలాగే సుజుకి యాక్సెస్ ద్విచక్ర వాహనం, ఏపీ 39 జీయూ 2581ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం కేసును 106(1) బీఎన్ఎస్ కింద నమోదైన హిట్ అండ్ రన్ కేసు నుంచి 103(1), 238(1), 61(1) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్లకు మార్చినట్లు పోలీసులు వెల్లడించారు.అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సుండుపల్లి పోలీసులు తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story