Tadipatri: బీజేపీ వైయస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్‌గా గంగాధర్ యాదవ్

Tadipatri: భారతీయ జనతా యువమోర్చా (BJYM) వైయస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్‌గా తాడిపత్రికి చెందిన పోతుల గంగాధర్ యాదవ్ నియామకం. హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు.

DILIP KUMAR, TADIPATRI
Published on: 7 Aug 2026 5:49 PM IST
Tadipatri
X

Tadipatri: బీజేపీ వైయస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్‌గా గంగాధర్ యాదవ్

తాడిపత్రి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) యువజన విభాగమైన భారతీయ జనతా యువమోర్చా (BJYM) వైయస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్‌గా తాడిపత్రికి చెందిన పోతుల గంగాధర్ యాదవ్ నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచే ప్రజా, విద్యార్థి సమస్యలపై పోరాడుతూ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం యువమోర్చా వైయస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

గంగాధర్ యాదవ్ ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ విద్యార్థి సమస్యలపై పలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం 2012 లో భారతీయ జనతా పార్టీలో చేరి, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ యువమోర్చా అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా గ్రంథాలయ కన్వీనర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థి, యువజన సమస్యలపై అనేక ఉద్యమాలు, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనంతపురం జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని కొత్త బాధ్యతగా కాకుండా ఒక కర్తవ్యంగా, నిబద్ధతగా స్వీకరిస్తున్నానని గంగాధర్ యాదవ్ తెలిపారు. యువతను సంఘటితం చేసి పార్టీ సిద్ధాంతాలు, దేశభక్తి, ప్రజాసేవా భావాలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

తనకు ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీ మధుకర్, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ కొనగొండ్ల రాజేశ్ పాటు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి గంగాధర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ బాధ్యత నాకు పదవి కాదు.. పార్టీ నాపై ఉంచిన నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా ప్రధాన కర్తవ్యం. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడానికి కృషి చేస్తాను” అని అన్నారు.

యువశక్తి దేశ ప్రగతికి ప్రధాన బలమని పేర్కొన్న ఆయన.. యువతను సానుకూల దిశలో నడిపిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం, ప్రజా సమస్యలపై ప్రజల తరఫున పోరాడటం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

“పదవి కోసం కాదు.. పార్టీ కోసం; ప్రచారం కోసం కాదు.. ప్రజాసేవ కోసం; వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు.. దేశ ప్రయోజనం కోసం” అనే సంకల్పంతో నిస్వార్థంగా, నిరంతరంగా, నిబద్ధతతో పనిచేస్తానని గంగాధర్ యాదవ్ స్పష్టం చేశారు.

వైయస్సార్ కడప జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో యువమోర్చా కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యువ కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచడం, పెద్ద సంఖ్యలో యువతను పార్టీతో అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, ప్రజా సమస్యలపై యువమోర్చా ఆధ్వర్యంలో చురుకైన కార్యక్రమాలు చేపట్టడం తన ముందున్న ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

పార్టీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వర్తిస్తూ.. యువమోర్చాను మరింత చైతన్యవంతమైన, క్రియాశీలకమైన యువశక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని గంగాధర్ యాదవ్ వెల్లడించారు.

DILIP KUMAR, TADIPATRI

DILIP KUMAR, TADIPATRI

Next Story