Kadapa: హిట్ అండ్ రన్.. ఆపకుండా వెళ్లిన వాహనం, ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు!

Kadapa: కడప జిల్లా మైదుకూరులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 3 Jun 2026 11:30 AM IST
Kadapa
X

Kadapa: హిట్ అండ్ రన్.. ఆపకుండా వెళ్లిన వాహనం, ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు!

కడప జిల్లా: మైదుకూరు మండలంలో తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైదుకూరు - బద్వేల్ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఉదయం నడక (Morning Walk)కు వెళ్లిన యువకులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

​వాకింగ్‌కు వెళ్తుండగా విరుచుకుపడ్డ

​పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మైదుకూరు మండలం జి.వి. సత్రం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బుధవారం ఉదయం మైదుకూరు-బద్వేల్ జాతీయ రహదారిపై వాకింగ్ చేస్తున్నారు. వీరు జి.వి. సత్రం సమీపంలోకి రాగానే, బద్వేల్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వీరిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టి, ఆగకుండా వేగంగా వెళ్ళిపోయింది.

​ఈ ప్రమాదం ఎంత ధాతుకంగా జరిగిందంటే, ఢీకొట్టిన వేగానికి యువకులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ​సుమంత్ (25) అనే యువకుడు తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ​తీవ్రంగా గాయపడిన మదన్ గోపాల్ (25) అనే మరో యువకుడిని స్థానికులు వెంటనే మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

​ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయ్ అనే మూడో యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

​ఘటనపై సమాచారం అందుకున్న మైదుకూరు పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం సుమంత్, మదన్ గోపాల్ ల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమై పరారైన గుర్తుతెలియని వాహనాన్ని, డ్రైవర్‌ను గుర్తించేందుకు జాతీయ రహదారిపై ఉన్న సిసిటివి (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

​ఉద్యోగాలు చేస్తూ, ఉన్నత భవిష్యత్తు ఉన్న 25 ఏళ్ల ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో జి.వి. సత్రం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story