Vemanapally: వేమనపల్లి లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాలు అందజేత!

Vemanapally: వేమనపల్లి గ్రంథాలయానికి సొంత నిధులతో పోటీ పరీక్షల పుస్తకాలు, కుర్చీలను అందజేసిన ఎస్సీ-ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్. విద్యార్థులకు అండ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Aug 2026 6:19 PM IST
Vemanapally
X

Vemanapally: వేమనపల్లి లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాలు అందజేత!

వేమనపల్లి: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం అందించేలా వేమనపల్లి గ్రంథాలయానికి చేయూత లభించింది. విద్యార్థుల అవసరాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ తన సొంత నిధులతో పోటీ పరీక్షల పుస్తకాలను అందజేయడంతో పాటు, లైబ్రరీకి అవసరమైన కుర్చీలను కూడా సమకూర్చారు. త్వరలో వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మంచిర్యాల జిల్లా వేమనపల్లి గ్రంథాలయాన్ని ఇటీవల సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్‌కు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల కొరత ఉందని విద్యార్థులు వివరించారు. విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ప్రవీణ్, తన సొంత ఖర్చుతో వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంథాలయానికి అందజేశారు.

అంతేకాకుండా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శితో మాట్లాడి, మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి కుర్చీలను తెప్పించి విద్యార్థులకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సూచించారు.

లైబ్రరీలో తాగునీటి కోసం వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా, త్వరలోనే దానిని కూడా ఏర్పాటు చేస్తానని రేణికుంట్ల ప్రవీణ్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు.

ఈ కార్యక్రమంలో దస్నాపూర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, ఏనుముల శేఖర్, చెన్నూరు సంతోష్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story