Mylavaram: ఎస్సై కొట్టాడని జమ్మలమడుగు పీఎస్ ముందే ఆత్మహత్యాయత్నం!

Mylavaram: మైలవరం ఎస్సై కొట్టాడని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం. జమ్మలమడుగు పీఎస్ ఎదుట విషద్రావణం తాగిన బుచ్చంపల్లె వాసి రాజమోహన్.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 18 Sept 2026 1:16 PM IST
Mylavaram
X

Mylavaram: ఎస్సై కొట్టాడని జమ్మలమడుగు పీఎస్ ముందే ఆత్మహత్యాయత్నం!

Mylavaram: కడప జిల్లా మైలవరం మండలంలో ఓ యువకుడు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.మైలవరం మండలం బుచ్చంపల్లెకు చెందిన రాజమోహన్ ఎస్సై కొట్టారంటూ మనస్తాపానికి గురై విషద్రావణం తాగినట్లు అతని తండ్రి రంగనాయకులు తెలిపారు. బాధితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం బుధవారం గ్రామంలో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇరువర్గాలకు చెందిన వారిని మైలవరం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ రాజమోహన్‌ను మైలవరం ఎస్సై శ్యాంసుందర్‌రెడ్డి కొట్టారని బాధితుడి తండ్రి ఆరోపించారు. అనంతరం మనస్తాపానికి గురైన రాజమోహన్ జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ ఎదుట విషద్రావణం తాగినట్లు తెలిపారు.

వెంటనే పోలీసులు అతడిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మైలవరం ఎస్సై శ్యాంసుందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడి తండ్రి రంగనాయకులు జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU