Kadapa: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం: కడప కలెక్టర్!

Kadapa: వైఎస్సార్ కడప జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 17 Nov 2026 11:51 AM IST
Kadapa
X

Kadapa: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం: కడప కలెక్టర్!

కడప: తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, సన్నద్ధత వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

రెండో విడతలో జిల్లాలోని 13 మండలాల్లో 203 గ్రామ పంచాయతీలకు సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఇందుకోసం 1,984 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 3,42,983 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 54 క్లస్టర్లు, నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై, 29వ తేదీన పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి పంపిణీ, బ్యాలెట్ పెట్టెల భద్రత, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.

13 మండలాల్లో రెండో విడత ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని సి.కె.దిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు, కమలాపురం, చక్రాయపేట, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వి.ఎన్.పల్లి, వేంపల్లి, వేముల మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ 13 మండలాల్లో మొత్తం 203 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని, ఇందుకోసం 1,984 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రెండో విడతలో 3,42,983 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

మండలాల వారీగా ఎన్నికల వివరాలు

సి.కె.దిన్నె మండలంలో 3 క్లస్టర్ల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు, పెండ్లిమర్రి మండలంలో 5 క్లస్టర్ల పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, వల్లూరు మండలంలో 4 క్లస్టర్ల పరిధిలో 13 గ్రామ పంచాయతీలు, చెన్నూరు మండలంలో 3 క్లస్టర్ల పరిధిలో 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

కమలాపురం మండలంలో 5 క్లస్టర్ల పరిధిలో 18 గ్రామ పంచాయతీలు, చక్రాయపేట మండలంలో 4 క్లస్టర్ల పరిధిలో 16 గ్రామ పంచాయతీలు, లింగాల మండలంలో 5 క్లస్టర్ల పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, పులివెందుల మండలంలో 2 క్లస్టర్ల పరిధిలో 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

సింహాద్రిపురం మండలంలో 5 క్లస్టర్ల పరిధిలో 20 గ్రామ పంచాయతీలు, తొండూరు మండలంలో 3 క్లస్టర్ల పరిధిలో 15 గ్రామ పంచాయతీలు, వి.ఎన్.పల్లి మండలంలో 6 క్లస్టర్ల పరిధిలో 22 గ్రామ పంచాయతీలు, వేంపల్లి మండలంలో 5 క్లస్టర్ల పరిధిలో 17 గ్రామ పంచాయతీలు, వేముల మండలంలో 4 క్లస్టర్ల పరిధిలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.

మొత్తంగా 13 మండలాల్లో 54 క్లస్టర్ల ద్వారా 203 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

18 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరించిన నామినేషన్లపై నవంబర్ 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వద్ద అప్పీలు చేసుకోవచ్చన్నారు. నవంబర్ 23న అప్పీళ్లను పరిష్కరిస్తారని... నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారన్నారు.

29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు

నవంబర్ 29వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారన్నారు. అదే రోజు ఉప సర్పంచి ఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

1,984 బ్యాలెట్ పెట్టెల కేటాయింపు

రెండో విడతలోని 203 గ్రామ పంచాయతీలకు మొత్తం 1,984 బ్యాలెట్ పెట్టెలను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో 331 బ్యాలెట్ పెట్టెలు ఇప్పటికే ఎంపిడిఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.

మిగిలిన అవసరాలకు అనుగుణంగా 207 పెద్ద పరిమాణం, 784 మధ్యస్థ పరిమాణం, 662 చిన్న పరిమాణం కలిగిన బ్యాలెట్ పెట్టెలను కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, ఇతర ఎన్నికల సామగ్రిని సకాలంలో చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ పెట్టెల స్వీకరణ, భద్రపరిచే ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నియమావళి అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించినట్లు తెలిపారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA