Edigapalli: ఈడిగపల్లిలో మతసామరస్య మొహర్రం సంబరాలు

Edigapalli: వైఎస్ఆర్ కడప జిల్లా వీరబల్లి మండలం ఈడిగపల్లిలో మొహర్రం (పీర్ల పండుగ) ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 24 Jun 2026 11:26 AM IST
Edigapalli
X

Edigapalli: ఈడిగపల్లిలో మతసామరస్య మొహర్రం సంబరాలు

Edigapalli: కడప జిల్లా వీరబల్లి మండలం ఈడిగపల్లి గ్రామంలో పూర్వీకుల కాలం నుంచి ప్రతి ఏటా జరిగే మొహరం వేడుకలను హిందువులే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పెద్ద పీర్లు బాదుల్లా స్వామి, రెడ్డేరు స్వామి, చందమామ స్వామి, అటాల స్వామి పీర్ల తోపాటు మరికొన్ని పీర్లను నెలకొల్పి 9 రోజుల పాటు మొహరం ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఈ నాలుగు పెద్ద పీర్లకు ఎంతో మహిమ ఉందని, ఈ పీర్లను పూజిస్తే భక్తుల కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో నమ్ముతున్నారు. మొక్కుబడులు ఉన్న భక్తులు పూల భాషికాలు సమర్పించడం, చాందిని బండ్లు ను కట్టించి తమ మొక్కుబడులను తీర్చుకుంటూ ఉంటారని గ్రామస్తులంటున్నారు. ఈ మొహరం వేడుకలకు ప్రతి ఏటా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పీర్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

మొహరం వేడుకలను నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు. ఈనెల 24న బుధవారం ఉదయం ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు, అదే రోజు రాత్రి వివిధ సాంస్కృతి కార్యక్రమాల మధ్య అగ్నిగుండ ప్రవేశం నిర్వహిస్తారు. తెల్లవారుజామున పీర్లను ఊరేగిస్తారు. 26న పీర్లను జల్ది కార్యక్రమానికి తీసుకెళ్తారు.

జల్ది కార్యక్రమం అనంతరం పీర్ల పండుగ ముగుస్తుందని మొహరం పండుగ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మొహరం వేడుకలను తిలకించేందుకు రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని నిర్వాహకులు తెలిపారు. మొహరం పండుగకు తరలి వచ్చే భక్తులకు అన్ని వసతులను ఏర్పాటు చేశామని వారు అన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story