Rayachoti: రాయచోటిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

Rayachoti: రాయచోటిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళనలు చేపట్టనున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 3 Aug 2026 2:47 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

అన్నమయ్య జిల్లా రాయచోటి:

వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.యువత, విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ, వారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైసీపీ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు నిర్ణయించారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవినీతి, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం, విద్యాదీవెన–వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.9,500 కోట్ల బకాయిలు, ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టుకునే దుస్థితి, డిగ్రీలు పూర్తి చేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం వంటి ప్రజా సమస్యలపై విస్తృత ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో రాయచోటి పట్టణంలో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన రాయచోటి పట్టణంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై న్యాయమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్పోర్ట్స్ కోటాలో చోటుచేసుకున్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులపై పడిన ఆర్థిక భారం తొలగించాలని కోరారు.ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడం తీవ్ర మోసమని పేర్కొంటూ, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాయచోటిలో ఉన్న జిల్లా కేంద్రాన్ని తరలించి ఈ ప్రాంత ప్రజల హక్కులను ,మనోభావాలును దెబ్బతీసి, అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగించారన్నారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.యువత, విద్యార్థుల హక్కుల సాధన కోసం నిర్వహించే రిలే నిరాహార దీక్షలు, శాంతియుత నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,మాజీ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైసీపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, పట్టణ కన్వీనర్ నవాజ్,బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ భాస్కర్ , వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story