Kadapa: కడప జిల్లా ఎస్పీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

Kadapa: కడప జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు వినతిపత్రం అందజేశారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 13 Oct 2026 6:58 PM IST
Kadapa
X

Kadapa: కడప జిల్లా ఎస్పీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

కడప జిల్లా: కడప జిల్లా ఎస్పీ శ్వనాథ్‌ను వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు కలిశారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను ఎస్పీకి అందజేసిన నేతలు.. ఆయా ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కడపలో జిల్లా ఎస్పీ శ్వనాథ్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, మాజీ మేయర్ పాక సురేష్, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ తదితర ముఖ్య నాయకులు కలిశారు.

జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలను ఎస్పీకి అందించిన నేతలు.. ఆయా కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించి, వారి పర్యవేక్షణలోనే పోలింగ్ నిర్వహించాలని కోరారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసి.. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు.

అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను సైతం కలిసి కేంద్ర బలగాల మోహరింపునకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరిన నేతలు.. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA