Gandepalli: ఆదిత్య విశ్వవిద్యాలయంలో 'వేద 2కే-26' జాతీయ సాంకేతిక ఉత్సవం!
Gandepalli: ఆదిత్య విశ్వవిద్యాలయంలో 'వేద 2కే-26' జాతీయ సాంకేతిక ఉత్సవం ప్రారంభం.. నూతన ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి అని డాక్టర్ శ్రీనివాసరెడ్డి పిలుపు.
Gandepalli: ఆదిత్య విశ్వవిద్యాలయంలో 'వేద 2కే-26' జాతీయ సాంకేతిక ఉత్సవం!
Gandepalli: గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద 2కె-26 జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం శుక్రవారం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఆదిత్య విశ్వవిద్యాలయ డిప్యూటీ ప్రో-ఛాన్సలర్ డా. ఎం. శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఆర్.కె. శరవణన్, డాక్టర్ పి.ఆర్.కె. రాజు, డాక్టర్ వి.కె. రాజు హాజరయ్యారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.బి. శ్రీనివాస్, రిజిస్ట్రార్ డా. జి. సురేష్, ఈ టెక్ పేస్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆదిత్య విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రో-వైస్ ఛాన్సలర్లు డా. ఏ. రమేష్, డా. ఎస్. రమాశ్రీ, డా. రవి తంగజం, వేద 2కె-26 సమన్వయకర్త డా. డి. కిషోర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా డా. ఎం. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం ద్వారా విజ్ఞాన కాంతులు విరజిమ్మాలని ఆకాంక్షించారు.
వేగంగా మారుతున్న శాస్త్ర, సాంకేతిక రంగంలో నూతన ఆలోచనలు, సృజనాత్మకతను పరస్పరం పంచుకునేందుకు ఇటువంటి జాతీయ స్థాయి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
అందరూ ఐన్‌స్టీన్‌లు కాలేకపోయినా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుందని, దానిని వెలికితీసేందుకు ఇటువంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తమలోని ప్రతిభను మరింత పెంపొందించుకుంటూ నిరంతరం నేర్చుకోవడం ద్వారానే భవిష్యత్తులో రాణించగలరని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, పరిశ్రమలకు అవసరమైన జ్ఞానాన్ని కేవలం తరగతి గదిలోని నాలుగు గోడల మధ్య పొందడం సరిపోదని అన్నారు. ఇటువంటి సాంకేతిక ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం, ఆచరణాత్మక జ్ఞానం లభిస్తాయని తెలిపారు.
ఇంజనీర్లు సృష్టికర్తలు అని, ఇంజనీర్లు లేని ప్రపంచాన్ని ఊహించడం కూడా కష్టమని పేర్కొన్నారు. భావి ఇంజనీర్లు చేపట్టే ప్రయోగాలు, వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు, నూతన సంస్థలు దేశ అభివృద్ధికి, సమాజ ప్రగతికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు.
భారతీయులు జ్ఞాన సంపదలో ముందున్నారని, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లోనూ అపారమైన ప్రతిభ దాగి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక కళ లేదా నైపుణ్యం ఉంటుందని, అయితే దానిని ప్రదర్శించేందుకు ముందడుగు వేసే చొరవ అవసరమని అన్నారు.
ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అనేక సంస్థలు, వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని, విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు.
వేద 2కె-26 సమన్వయకర్త డా. డి. కిషోర్ మాట్లాడుతూ “సృష్టించండి.. ప్రదర్శించండి.. ఆవిష్కరించండి.. స్ఫూర్తినివ్వండి” అనే నినాదంతో వేద 2కె-26 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో వివిధ సాంకేతిక పోటీలు, ప్రదర్శనలు, విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
అనంతరం అతిథులు విద్యార్థులు రూపొందించిన వివిధ సాంకేతిక ప్రాజెక్టులు, నమూనాలను పరిశీలించారు. ప్రాజెక్టుల రూపకల్పన, వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




