Anakapalle: వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకపోయినా బుద్ధి మారలేదు.. జనసేన ధ్వజం

Anakapalle: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైసీపీ కుల రాజకీయాలకు తెరలేపుతోందని అనకాపల్లి జనసేన నేతలు మండిపడ్డారు.

SURESH, AMALAPURAM
Published on: 22 Jun 2026 8:51 PM IST
Anakapalle
X

Anakapalle: వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకపోయినా బుద్ధి మారలేదు.. జనసేన ధ్వజం

Anakapalle: మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు స్థానిక జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల రామచంద్రపురంలో వైసీపీ నేతలు నిర్వహించిన సమావేశం, అలాగే కృష్ణలంకలో చోటుచేసుకున్న సాయి కృష్ణ ఘటనపై స్పందిస్తూ జనసేన నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైసీపీ నాయకత్వం నిరంతరం కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను కులాలు, వర్గాల వారీగా విభజించి, ఆయా సామాజిక వర్గాల నేతలతోనే వ్యక్తిత్వ హననానికి పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించారని విమర్శించారు.

గత ఐదేళ్ల పాలనలో ఇదే విధానాన్ని అనుసరించడం వల్లే ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ పార్టీ నాయకత్వంలో మార్పు కనిపించడం లేదని అన్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను కూడా కులాలతో ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడటం సమాజానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

కాపు సామాజిక వర్గం సంక్షేమం గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు, తమ ప్రభుత్వ హయాంలో ఆ వర్గానికి జరిగిన అన్యాయాలను ఎందుకు గుర్తు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. కాపు భవనాలకు కేటాయించిన స్థలాలను ఆక్రమించడం, విదేశీ విద్యా పథకాల నిధులను నిలిపివేయడం వంటి చర్యలతో ఆ వర్గాన్ని తీవ్రంగా నష్టపరిచారని ఆరోపించారు.

అలాగే ప్రభుత్వ పథకాల అమలులో కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన వివక్ష చూపిన పార్టీ వైసీపీనేనని విమర్శించారు. రామచంద్రపురంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు గతంలో ఇదే రాజకీయ విధానాన్ని అనుసరించడం వల్లే ప్రజల చేతిలో ఘోర పరాజయం చవిచూశారని అన్నారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను ప్రజలు సహించరని, అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆయనకు ఉందని జనసేన నాయకులు స్పష్టం చేశారు. ఇకపై కూడా వైసీపీ ఇదే విధమైన రాజకీయాలను కొనసాగిస్తే ప్రజల నుంచి గట్టి ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి దూలం గోపి, గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ, హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్, మాజీ ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, జనసేన నేతలు గంగుపాం జగదీష్, చంద్రావతి, లక్ష్మీనారాయణ, దాడి బుజ్జి (జగన్నాథ స్వామి దేవస్థానం చైర్మన్), సేనాపతి రవి తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story