Razole: అంతర్వేది కళ్యాణానికి ‘రాష్ట్ర పండుగ’ హోదా!
Razole: రాజోలులో గొల్లపల్లి అమూల్య 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'. అంతర్వేది స్వామివారి కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు సానుకూలత.
Razole: అంతర్వేది కళ్యాణానికి ‘రాష్ట్ర పండుగ’ హోదా!
Razole: రాజోలు మండలం పొదలాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ తమ సమస్యల్ని వివరిస్తు ఇంచార్జికి పలు అర్జీలు ఇచ్చారు.
ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ.. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి ముందు ముందు మంచి రోజులు రాబోతున్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు దేవ వరప్రసాద్ అభ్యర్థన మేరకు లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా జరిపేందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం తెలిసిందన్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు.
ఇది నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో విపత్తుల నుండి ఇక్కడ ప్రజలను నిత్యము కాపాడుతున్న దేవ దేవుని కళ్యాణం మరింత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇది ఒక గొప్ప వరం అన్నారు. దీనికి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గ పరిధిలో ఏర్పడిన పలు ఖాళీ ఉద్యోగాలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తో సమన్వయం చేసుకుంటూ భర్తీ చేస్తామని తెలిపారు.
అలాగే కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మనలో మనకే విభేదాలు సృష్టించే దుష్ట శక్తులు ఉంటారని.. అటువంటి వారికి దూరంగా ఉండాలని, ముఖ్యంగా యువకులు ఎంతో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చిటికెన రామ్మోహన్ రావు,అడబాల సాయిబాబు మరియు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




