Pitapuram: పిఠాపురం పరిధిలో అక్రమ మద్యం, గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం!
Pitapuram: గొల్లప్రోలులో జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Pitapuram: పిఠాపురం పరిధిలో అక్రమ మద్యం, గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం!
Pitapuram: గొల్లప్రోలు గ్రామంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్,జిల్లా ఎస్పీ బిందుమాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కాకినాడ సబ్ డివిజన్ ఇన్చార్జ్ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజామున గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లప్రోలు గ్రామం రంగప్ప చెరువు ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ మరియు నేరాల నివారణలో భాగంగా సర్కిల్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది గ్రామంలోని ముఖ్య ప్రాంతాలు, వీధులు మరియు అనుమానాస్పద ప్రదేశాలను చుట్టుముట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, పాత నేరస్తులు మరియు అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, నాటు సారా మరియు అక్రమ మద్యం నిల్వలు లేదా విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశంపై తనిఖీలు నిర్వహించారు.
అదేవిధంగా గ్రామ పరిధిలోని బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయ కేంద్రాలు మరియు అనుమానాస్పద ప్రదేశాలను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించారు. నాటు సారా తయారీ, రవాణా, నిల్వ మరియు విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వాహనాలపై కూడా విస్తృత తనిఖీలు నిర్వహించగా, సరైన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ పత్రాలు లేని మొత్తం 58 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహన యజమానులపై నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
గ్రామ ప్రజలు కొత్తగా గ్రామానికి వచ్చే వ్యక్తుల వివరాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, మత్తు పదార్థాల విక్రయాలు, నాటు సారా తయారీ లేదా అక్రమ మద్యం విక్రయాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
నేరాల నియంత్రణలో భాగంగా రాత్రి పహారా, వాహన తనిఖీలు మరియు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మత్తు పదార్థాలు మరియు అక్రమ మద్యం నిర్మూలనలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని పోలీసులు కోరారు.




