Korukonda: మట్టి మాఫియాపై జక్కంపూడి పోరు.. 12 గంటల ఉద్రిక్తత

Korukonda: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో అక్రమ మట్టి టిప్పర్ ఢీకొని నొక్కి రాజు వర్మ అనే యువకుడు మరణించాడు.

NARAYANA, RAJANAGARAM
Published on: 18 May 2026 8:16 PM IST
Korukonda
X

Korukonda: మట్టి మాఫియాపై జక్కంపూడి పోరు.. 12 గంటల ఉద్రిక్తత

Korukonda: కోరుకొండ మండలంలో అక్రమ మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నరసాపురం గ్రామానికి చెందిన నొక్కి రాజు వర్మ(27) మృతి చెందగా, మరో యువకుడు సలారు విక్కీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టడంతో కోరుకొండలో అర్ధరాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే జక్కంపూడి రాజా ఘటనాస్థలికి చేరుకుని మృతదేహం పక్కనే రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, గాయపడిన యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సుమారు 12 గంటల పాటు నిరాహార దీక్ష కొనసాగించారు.

ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ కోరుకొండ మండలంలోని చెరువులు, కొండల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మట్టి, గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్ లారీలు అధిక వేగంతో దూసుకెళ్తుండటంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. మట్టి మాఫియాను నియంత్రించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు.

మరోవైపు నరసాపురం గ్రామం నుంచి మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున కోరుకొండ చేరుకుని బస్టాండ్ జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు కోరుకొండకు చేరుకున్నాయి. రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించగా, పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆందోళనకారులను అరెస్ట్ చేసి వ్యాన్లలో తరలించారు.

ఈ క్రమంలో మృతదేహాన్ని బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా జక్కంపూడి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయకుండా బలవంతపు చర్యలు చేపడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

చివరకు అధికారుల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం మట్టి మాఫియా తరఫున రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు అంగీకారం కుదిరింది. అదనంగా జక్కంపూడి రాజా తన వ్యక్తిగతంగా రూ.4 లక్షలు ప్రకటించారు. మరో రూ.1 లక్ష కలిపి మొత్తం రూ.20 లక్షల పరిహారం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అందులో మృతుడు రాజు వర్మ కుటుంబానికి రూ.18 లక్షలు, గాయపడిన యువకుడు విక్కీ కుటుంబానికి రూ.2 లక్షలు అందించేందుకు అంగీకారం కుదరడంతో జక్కంపూడి రాజా తన ఆందోళనను విరమించారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story