Gollaprolu: గొల్లప్రోలులో బాల్య వివాహం అడ్డుకున్న పోలీసులు
Gollaprolu: కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాలతో గొల్లప్రోలులో 8వ తరగతి బాలిక బాల్య వివాహాన్ని అడ్డుకున్న పిఠాపురం పోలీసులు. చదువు చెప్పించేందుకు తల్లిదండ్రుల అంగీకారం.
Gollaprolu: గొల్లప్రోలులో బాల్య వివాహం అడ్డుకున్న పోలీసులు
గొల్లప్రోలు: గొల్లప్రోలు గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికకు బాల్య వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, IPS గారికి సమాచారం అందడంతో, వారి ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ G.V.V. సత్యనారాయణ మరియు గొల్లప్రోలు ఎస్హెచ్ఓ ఎన్. రామకృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి బాలిక ఇంటిని సందర్శించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాల నిషేధ చట్టం, వాటి చట్టపరమైన పరిణామాలు, బాలికల విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలను వివరించారు. పోలీసుల కౌన్సెలింగ్కు స్పందించిన తల్లిదండ్రులు వివాహ ప్రతిపాదనను విరమించుకుని, బాలిక చదువును కొనసాగిస్తామని అంగీకరించారు.
అదేవిధంగా, పిఠాపురం మండల సీడీపీఓ శ్రీమతి CH.S. K.దుర్గాదేవి కూడా బాలిక ఇంటిని సందర్శించి, బాలికకు మరియు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిఠాపురం మండల సీడీపీఓ మరియు జిల్లా విద్యాశాఖాధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని లేఖలు పంపించడం జరిగింది. బాల్య వివాహాన్ని సకాలంలో అడ్డుకుని బాలిక భవిష్యత్తును కాపాడిన పోలీసు అధికారులను, సిబ్బందిని కాకినాడ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
తల్లిదండ్రులకు పోలీసుల విజ్ఞప్తి:
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. పిల్లల బాల్యాన్ని, విద్యను, ఆరోగ్యాన్ని కాపాడుతూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా పోలీసు శాఖ కోరుతోంది.




