Tuni: తునిలో రైలు కింద చిక్కుకున్న ప్రయాణికుడి రక్షణ!

Tuni: తుని రైల్వే స్టేషన్‌లో రైలు కింద చిక్కుకున్న ప్రయాణికుడిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు. ప్రాణాలకు తెగించి బయటకు లాగిన అధికారికి అభినందనలు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 8:19 AM IST
Tuni
X

Tuni: తునిలో రైలు కింద చిక్కుకున్న ప్రయాణికుడి రక్షణ!

Tuni: తుని, రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన ఓ ప్రయాణికుడికి ఓ పోలీస్ అధికారి ఆపద్బాంధవుడిగా నిలిచారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బోగీ కిందకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు (HC-496) చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖపట్నం నుంచి అలప్పీ వెళ్తున్న ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ తుని రైల్వే స్టేషన్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఓ గుర్తుతెలియని ప్రయాణికుడు రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి బోగీ కింద పట్టాలపై పడిపోయాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి పట్టాల మధ్య చిక్కుకుపోయాడు.

అక్కడ ఉన్న పలువురు ప్రయాణికులు భయంతో దూరంగా ఉండిపోయారు. కొందరు ఘటనను వీడియోలు తీస్తూ కనిపించారు. అయితే అదే రైలులో ప్రయాణిస్తున్న ఎలమంచిలి రూరల్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు మాత్రం క్షణం ఆలస్యం చేయలేదు.

రైలు ఆగిన వెంటనే పరిస్థితిని గమనించిన చంద్రరావు.. ఏమాత్రం ప్రాణభయం లేకుండా బోగీ కిందకు వెళ్లారు. తీవ్ర గాయాలతో పట్టాల మధ్య చిక్కుకున్న ప్రయాణికుడిని జాగ్రత్తగా బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం బాధితుడిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన చంద్రరావు ధైర్యసాహసాలను రైల్వే సిబ్బంది, ప్రయాణికులు అభినందించారు. ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్రతో పాటు ఉన్నతాధికారులు కూడా హెడ్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు.

విధి నిర్వహణలో పోలీసుల బాధ్యత కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాదని.. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడటం కూడా తమ కర్తవ్యమేనని చంద్రరావు తన చర్యతో చాటిచెప్పారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన ఆయన మానవత్వానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI