Jaggampeta: జగ్గంపేటలో జేసీ అపూర్వ భరత్ తనిఖీలు!

Jaggampeta: జగ్గంపేట మండలంలో జేసీ అపూర్వ భరత్ విస్తృత తనిఖీలు చేశారు. రాబోయే ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 14 Oct 2026 8:00 PM IST
Jaggampeta
X

Jaggampeta: జగ్గంపేటలో జేసీ అపూర్వ భరత్ తనిఖీలు!

జగ్గంపేట: రాబోయే ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయడమే కాకుండా, ధాన్యం తూకాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం ఆయన జగ్గంపేట మండలంలో బియ్యం మిల్లు, చౌక ధరల దుకాణాలు, నిల్వ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈ పర్యటనలో భాగంగా జేసీ మొదటగా శ్రీ బాలాజీ బియ్యం మిల్లును సందర్శించి, మిల్లులోని యంత్రాల పనితీరు, ధాన్యం ఆరబెట్టే యంత్రాల సామర్థ్యం, బియ్యం తయారీ ప్రక్రియను కూలంకషంగా తనిఖీ చేశారు. రాబోయే పంట కాలంలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ సమయానికి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా, సీజన్ ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేసుకోవాలని మిల్లు నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు చేశారు.

అదేవిధంగా, జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని చౌక ధరల దుకాణం నంబరు 0418021ను సందర్శించి నిత్యావసర సరుకుల పంపిణీని పరిశీలించారు. దుకాణానికి చేరిన సరుకుల నిల్వలు, పంపిణీ తీరుపై డీలరును వివరాలు అడిగారు. బియ్యం కార్డుల్లోని సభ్యుల విద్యుత్ సమ్మతి ధ్రువీకరణను వేగవంతం చేయాలని, సరుకుల పంపిణీ శాతాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. అలాగే లబ్ధిదారుల ఫోన్ నెంబర్లు అనుసంధాన ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని చౌక ధరల దుకాణం నిర్వాహకుడిని ఆదేశించారు.

అనంతరం జేసీ జగ్గంపేట నిత్యావసర సరుకుల నిల్వ కేంద్రాన్ని సందర్శించి, అక్కడి తూకం యంత్రాల పనితీరును స్వయంగా తనిఖీ చేశారు. తూకాల్లో ఖచ్చితత్వం పాటిస్తున్నారా లేదా అని పరిశీలించి, ధాన్యం తూక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా తూకాల్లో తేడాలు రాకుండా పక్కాగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు.

తదుపరి జగ్గంపేట–1 రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ముందస్తు చర్యలపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మండలంలో ధాన్యం కోతల పరిస్థితి, పంట కోత యంత్రాల లభ్యత, సేకరణకు కావలసిన గోనె సంచులతో సహా ఇతర వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం విక్రయించే క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా సమగ్ర ప్రణాళికతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఆనందరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రసన్న లక్ష్మి దేవి, తహసీల్దార్ రమేష్ ఇతర శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA