Z Ragampeta: భవానీ భక్తులకు నాగేంద్ర చౌదరి అన్నదాన సేవ
Z Ragampeta: జెడ్.రాగంపేటలో అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యుడు నాగేంద్ర చౌదరి భవానీ భక్తులకు అందిస్తున్న నిరంతర సేవలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించి అభినందించారు.
Z Ragampeta: భవానీ భక్తులకు నాగేంద్ర చౌదరి అన్నదాన సేవ
కాకినాడ జిల్లా: స్థానిక జెడ్.రాగంపేట శివారులోని మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో కాలినడకన విజయవాడ వెళ్తున్న భవాని దీక్షదారులకు అందిస్తున్న సేవలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా పరిశీలించారు.
అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా భవాని భక్తులు, అయ్యప్ప స్వాములు, ఇతర దీక్షదారులకు 365 రోజుల పాటు ఉచితంగా మూడు పూటలా భోజనం, వసతి, మెడికల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఈ సేవలను అభినందించడానికి జ్యోతుల నెహ్రూ రెసిడెన్సీకి వెళ్లి స్వయంగా భవాని దీక్షదారులకు ఆహార పదార్థాలు వడ్డించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ - తమ నాయకుడు జ్యోతుల నెహ్రూ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశీస్సులతో తొమ్మిది సంవత్సరాలుగా కాలినడక యాత్ర చేస్తున్న హిందూ బంధువులందరికీ ఉచిత వసతి, భోజనం కల్పించడం జరుగుతోందన్నారు.
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ - జగ్గంపేట మెట్ట ప్రాంతం నుండి ఇచ్చాపురం వరకు హిందూ బంధువులు ప్రతి సంవత్సరం వేలాదిగా విజయవాడ దుర్గమ్మ గుడికి కాలినడకన వెళుతుంటారని, అలాంటి భక్తులకు నాగేంద్ర చౌదరి చేస్తున్న సేవ ఒక మహా యజ్ఞమని అన్నారు. 24 గంటలు అలసట లేకుండా భక్తులకు సేవ చేస్తూ అందరి ఆశీస్సులు పొందుతున్నారని కొనియాడారు. చిన్నప్పటి నుండి భగవత్ కార్యాలు చేయడం వల్లనే అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా నియమితులయ్యారని, భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గో సంరక్షణ, గోశాల నిర్వహణతో హిందూ ధర్మ పరిరక్షణలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జీను మణి బాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, నే దూరి గణేష్, కొండ్రోతు శ్రీను, అధిక సంఖ్యలో భవాని భక్తులు పాల్గొన్నారు.




