Jaggampeta: జటాద్రి కొండపై శివాలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన

Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం బలభద్రపురం జటాద్రి కొండపై కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయ నిర్మాణానికి కాంగ్రెస్ ఇన్‌చార్జి మరోతి శివగణేష్ శంకుస్థాపన.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 24 Nov 2026 7:10 PM IST
Jaggampeta
X

Jaggampeta: జటాద్రి కొండపై శివాలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన

జగ్గంపేట: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం బలభద్రపురం గ్రామంలోని జటాద్రి కొండపై శ్రీ భూదేవి సమేత జటాద్రి బలభద్రేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మరోతి శివగణేష్ ఆధ్వర్యంలో బలభద్రపురం గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మరోతి శివగణేష్ మాట్లాడుతూ సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జటాద్రి కొండను మహా పుణ్యక్షేత్రంగా, దైవక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటివరకు 15 నుంచి 20 ఎకరాల పరిధిలో డి-ఫారం పట్టాలు పొందిన రైతులు, అలాగే సాగు చేసుకుంటున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన డి-ఫారం రైతులకు, సాగుదారులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలంతో పవిత్రమైన జటాద్రి పర్వతంపై ఎవరైనా అక్రమ చొరబాట్లకు, ఆక్రమణలకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడేందుకు గ్రామస్థులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కట్టమూరి రామకృష్ణ, యర్రా పరమేశ్వరరావు, ముమ్మన శ్రీనివాసరావు, సీదిరి మరిదియ్య, పప్పుల శ్రీనివాసరావు, ద్వారపూడి సత్యనారాయణ, అమరపల్లి సింగారమ్మతో పాటు బలభద్రపురం గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA