Jaggampeta: సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థులు లేరు: నెహ్రూ!
Jaggampeta: సర్పంచ్ ఎన్నికలకు కూటమి పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించలేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.
Jaggampeta: సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థులు లేరు: నెహ్రూ!
జగ్గంపేట: కాకినాడ జిల్లా జగ్గంపేట తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు.. కూటమి ఉమ్మడి అభ్యర్థులు లేరు, ఉన్నది సర్పంచ్ అభ్యర్థులే - ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టీకరణ, స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల అఖండ విజయానికి సహకరించిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
సర్పంచ్ ఎన్నికలపై కీలక ప్రకటన..
రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సరైన అభ్యర్థిని ఎన్నుకుని గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.
కొంతమంది కూటమి పార్టీల అభ్యర్థులం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. "సర్పంచ్ ఎన్నికలకు కూటమి పార్టీలు ఉమ్మడిగా ఎటువంటి అభ్యర్థులను ప్రకటించలేదు. కొన్ని గ్రామాల్లో మేము తెలుగుదేశం పార్టీ తరపున మాత్రమే అభ్యర్థులను ప్రకటించాము" అని స్పష్టం చేశారు.
కొన్ని గ్రామాల్లో పార్టీలోనే ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీకి రావడంతో ఎవరు గెలిచినా వారిని మనవారిగానే స్వీకరిస్తామని, గెలవని వారిని కూడా కలుపుకుని వెళ్తామన్నారు. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి గ్రామాల్లో రాజీ కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
గోకవరంలో టీడీపీ అభ్యర్థి గాజింగం సత్తిబాబు సతీమణి మాత్రమే..
ముఖ్యంగా గోకవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరపున గాజింగం సత్తిబాబు సతీమణిని అధికారిక అభ్యర్థిగా ప్రకటించామని, అక్కడ కొంతమంది తామే కూటమి అభ్యర్థులం అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు.
ఏకగ్రీవాలకు ప్రభుత్వ ప్రోత్సాహం..
గ్రామాల్లో ఏకగ్రీవాలు జరిగితే ఆ గ్రామాలకు ప్రభుత్వం నుండి అదనపు నిధులు, ప్రత్యేక సహకారం అందుతుందని, కాబట్టి ప్రతి గ్రామంలో ఏకగ్రీవం జరిగే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే బొర్రంపాలెం, జె.రాగంపేట, మల్లీశాల వంటి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, మరిన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నించాలని కోరారు.
సర్పంచ్ ఎన్నికలకు పార్టీ సింబల్ లేకపోయినా, పార్టీలకు సంబంధం లేకపోయినా కూటమి పార్టీలు కలిసివస్తే, గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో చేర్చుకున్న విధంగానే మండలానికి ఇద్దరు సర్పంచుల చొప్పున కలుపుకుని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భరోసా ఇచ్చారు.




