Peddapuram: ఆలయానికి పూలమాలలు ఇవ్వొద్దంటూ వైసీపీ నేత బెదిరింపులు!

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు కేశవ పట్టాభిరామ ఆలయానికి పూలమాలలు ఇవ్వొద్దంటూ సన్నాయి కళాకారుడిని బెదిరించిన మాజీ చైర్మన్ మెడిది శ్రీనివాసరావుపై కేసు నమోదైంది.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 12 Nov 2026 6:21 PM IST
Peddapuram
X

Peddapuram: ఆలయానికి పూలమాలలు ఇవ్వొద్దంటూ వైసీపీ నేత బెదిరింపులు!

పెద్దాపురం: పెద్దాపురం పట్టణానికి చెందిన పుల్లయ్య గత 20 ఏళ్లుగా సర్పవరం భావనారాయణ స్వామి ఆలయంలో సన్నాయి వాయిద్యకారుడిగా సేవలు అందిస్తున్నారు. అయితే, కట్టమూరు కేశవ పట్టాభిరామ ఆలయానికి మరియు భావనారాయణ స్వామి ఆలయానికి రెండు ఆలయాలకు ఒకే అధికారి ఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈవో ఆదేశాల మేరకు పెద్దాపురానికి చెందిన పుల్లయ్య ద్వారా నాలుగు నెలలుగా కట్టమూరు కేశవ పట్టాభిరామ ఆలయానికి తులసిమాలలు, పూలమాలలు ఏవో పంపిస్తూ వస్తున్నారు.

అయితే, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో లేకపోయినా.. కేశవ పట్టాభిరామ ఆలయ మాజీ చైర్మన్, వైసీపీ నేత అయిన మెడిది శ్రీనివాసరావు తన అజమాయిషీని చెలాయిస్తూ ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దేవుడికి పూలమాలలు పంపవద్దంటూ పుల్లయ్యను మెడిది శ్రీనివాసరావు గత నెల 24 వ తేదీన బెదిరింపులకు గురిచేశారు. ఈవో గారి ఆదేశాల ప్రకారమే తాను మాలలు వేస్తున్నానని పుల్లయ్య చెప్పినప్పటికీ శ్రీనివాసరావు ఘర్షణకు దిగారు.

తర్వాత మళ్ళీ ఈ నెల ఎనిమిదవ తేదీన మాజీ చైర్మన్ మెడిది శ్రీనివాసరావు పుల్లయ్యకు ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో తిట్ల దండకం అందుకున్నారు. ఇద్దరి మధ్య ఫోన్‌లో జరిగిన ఈ బూతుల బాగోతం, తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. అధికారంలో లేకపోయినా ఆలయాల్లో వేధింపులకు పాల్పడుతున్న వైసీపీ నేతల తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దాపురంలో మీడియా సమావేశం నిర్వహించి, కుల వృత్తిని దూషించిన మెడిది శ్రీనివాసరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పెద్దాపురం ఎస్ఐని కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావు పై కేసు నమోదు చేసినట్లు పెద్దాపురం ఎస్ఐ పాపారావు తెలిపారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM