Kakinada: తుఫాన్ తీర ప్రాంతాల్లో ఎస్పీ బిందుమాధవ్ ఆకస్మిక తనిఖీలు!

Kakinada: కాకినాడ జిల్లాలో అర్నాబ్ తుఫాన్ తీర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ బిందుమాధవ్. రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ తరహా ఆంక్షలు, 100% భద్రతకు ఆదేశం.

V. Ramakrishna, Pithapuram
Published on: 27 Oct 2026 11:20 PM IST
Kakinada
X

Kakinada: తుఫాన్ తీర ప్రాంతాల్లో ఎస్పీ బిందుమాధవ్ ఆకస్మిక తనిఖీలు!

కాకినాడ: అర్నాబ్ తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రతను పర్యవేక్షించేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ సూర్యారావుపేట, లైట్‌హౌస్, ఎన్టీఆర్ బీచ్, వాకలపూడి, నేమాం ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తుఫాను చెక్‌పోస్టులను స్వయంగా తనిఖీ చేసి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

తుఫాను ప్రభావంతో చెట్లు కూలిపడిన సందర్భాల్లో వెంటనే స్పందించి, ట్రీ కట్టర్ల సహాయంతో రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను కారణంగా ఏ ఒక్కరి ప్రాణం కోల్పోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని, పాల ప్యాకెట్లు, పండ్లు, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర నిత్యావసర సరుకులను ముందుగానే సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలని కోరారు.

రాత్రి 08.00 గంటల నుండి ఉదయం 05.00 గంటల వరకు ప్రజలు రోడ్లపై తిరగరాదని, షాపులన్నీ రాత్రి 08.00 గంటల లోపు మూసివేయాలని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు.

ఈ తనిఖీల్లో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కె.వి.వి. సత్యనారాయణ, కాకినాడ రూరల్ సీఐ డి. చైతన్య కృష్ణ, ట్రాఫిక్ 2 ఇన్స్పెక్టర్ డి రామారావు, తిమ్మాపురం ఎస్‌ఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram